కేంద్రం సహకరించకపోయినా.. బయ్యారం ఆగదు

We Will Start Bayyaram Steel Factory Construction Soon Says KCR - Sakshi

సింగరేణి నేతృత్వంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపడతాం

ఖమ్మం, మహబూబాబాద్‌ ఎన్నికల సభల్లో సీఎం కేసీఆర్‌

దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలివి.. వ్యక్తుల మధ్య పోరుకాదు

ఇంకా ఎన్నేళ్లు గరీబీ పేరు చెప్పుకుని మోసం చేస్తారు

కాంగ్రెస్, బీజేపీలు ఏకమైనా ప్రభుత్వం ఏర్పాటు చేయలేవు

ప్రాంతీయ పార్టీలదే ఉజ్వల భవిత

టీఆర్‌ఎస్‌కు 16 సీట్లొస్తే.. గవర్నర్, రాయబారి పదవులు మనకొస్తయ్‌

రైతు బిడ్డను కాబట్టే.. రైతు సమస్యలపై దృష్టిపెట్టానని సీఎం వెల్లడి

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా తెలంగాణవాసుల చిరకాల కోరిక అయిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఈసారి నిర్మించుకుని తీరుతాం. అవసరమైతే సింగరేణి సంస్థకు అప్పగించి ఫ్యాక్టరీని పూర్తి చేసేందుకు పూనుకుంటాం’అని సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటించారు. గురువారం ఖమ్మం, మహబూబాబాద్‌ల్లో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో మూడ్రోజులపాటు రాష్ట్ర అధికార యంత్రాంగం యావత్తు మంత్రులతో సహా మకాం వేసి సమస్యలను పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలు అధికారంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని, దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోందని కేసీఆర్‌ అన్నారు.

రాష్ట్రంలో 16 సీట్లు టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటే దేశ గతిని మార్చి.. ప్రజారంజకమైన పాలన అందించే అవకాశం టీఆర్‌ఎస్‌ చేతిలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశగతి గమనానికి తెలంగాణ ప్రజలు వైతాళికులు కావాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలను స్థానిక ఎన్నికల్లా పరిగణించొద్దని, దేశ భవిష్యత్‌ను, దేశ గమనాన్ని మార్చే ఎన్నికలుగా చూడాలే తప్ప.. వ్యక్తుల మధ్య జరిగే ఎన్నికలుగా వీటిని పరిగణించరాదన్నారు. నానమ్మ ఇందిరాగాంధీ, ముత్తాత జవహర్‌లాల్‌ నెహ్రూ, నాన్న రాజీవ్‌గాంధీ, మధ్యలో పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌లు ప్రధానులుగా ఉన్న కాలంలో ఇచ్చిన నినాదాలైన దరిద్రో నారాయణ, గరీబీ హటావో వంటి పదాలనే రాహుల్‌గాంధీ వల్లె వేస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మోదీతో ఒరిగిందేంటి?
చాయ్‌వాలా, చౌకీదార్‌ రూపంలో ఉన్న ప్రధాని మోదీ వల్ల దేశానికి ఒరిగిందేమిటని, బీజేపీ పాలించినంత కాలం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పకుండా భవిష్యత్‌ అంతా వెలిగిస్తామంటే నమ్మేది ఎవరని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల ప్రభ దేశంలో రోజురోజుకూ తగ్గుతోందని, ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవని, ఒకవేళ రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను, సహజ వనరులను వినియోగించుకోవడంలో కాంగ్రెస్, బీజేపీలు ఘోరంగా విఫలమయ్యాయని, బీజేపీ తాము అధికారంలోకి రాగానే కుబేరుల వద్ద గల నల్లడబ్బును కొల్లగొట్టి ఇంటికి రూ.15లక్షల చొప్పున ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీనే నమ్ముకున్న నాయకులు సర్పంచ్‌ నుంచి కేంద్ర మంత్రి వరకు అన్ని మంత్రి పదవులను అనుభవించగలిగారని, దేశంలో కీలకమైన గవర్నర్, రాయబారి పదవులు మాత్రమే టీఆర్‌ఎస్‌ నేతలకు రాలేదన్నారు. ఈసారి 16 సీట్లు గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో కీలకశక్తిగా మారితే.. ఈ పదవులు సైతం తెలంగాణ నేతలకు దక్కుతాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఖమ్మం జిల్లాలో గ్రానైట్‌ పరిశ్రమ ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, ఈ రంగానికి చేయూతనిచ్చే బాధ్యత తనదేనన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తి కాగానే నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి త్వరలో కొత్త రెవెన్యూ చట్టం రాబోతుందన్నారు. సభలో టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు, టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, రాములునాయక్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వరరెడ్డి, నూకల నరేష్‌రెడ్డి, కార్యదర్శి తాతా మధుసూదన్, జెడ్పీ చైర్మన్‌ బరపటి వాసుదేవరావు, కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, తాటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నాయకుడు వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, పిడమర్తి రవి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా.. కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్న సత్తుపల్లి, కొత్తగూడెం ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు సభా ప్రాంగణానికి వచ్చినా.. వేదిక మీదకు మాత్రం వెళ్లలేదు. వారు అతిథులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలో కూర్చుని సీఎం ప్రసంగం ఆసాంతం ఆలకించారు.

ఈ హటావో డ్రామా ఎన్నాళ్లు?
‘రాహుల్‌ గాంధీ గరీబీ హటావో అంటున్నాడు. వాళ్ల నాయన్మమ అదే చెప్పింది. ఇప్పుడు కూడా రాహుల్‌ గాంధీ అదే చెబుతాండు. ఎన్నేళ్లు, ఎన్ని దశాబ్దాలు గరీబోళ్లుగా ఉండాలె. ఈ హటావో డ్రామా ఎప్పటి దాకా ఉండాలె’అని మహబూబాబాద్‌ సభలో కేసీఆర్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాలోతు కవితకు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘భూ తగాదాలు, పంచాయితీలు పోవాలి. సాధారణమైన వాళ్లది కావొచ్చు. పోడు భూముల వాళ్లది కావొచ్చు. ఒక్కటే మాట మీకు చెబుతున్నా. కేసీఆర్‌ బాగా మొండి. మీకు తెలుసు. నేను గట్టిగా అనుకుంటే ఎట్ల చేస్తనో మీకు తెలుసు. తెలంగాణ ఈ దేశానికే ఆదర్శం కావాలి. ఆదర్శం కావాలి. తెలంగాణ నుంచే భారతదేశం మొత్తం నేర్చుకోవాలి. ఒక్క ఎకరం గురించి కూడా భూమి కిరికిరి ఉండొద్దు. అట్లా లేకుండా చేసే జిమ్మేదారి నాది. అది పోడు భూమా.. పట్టా భూమా వారస్వత్వంలో వచ్చిందా.. ఏ పద్ధతిలో రానీగాక. ఆ భూమి ఎవలది అనేది నిర్ధారణగా, అవసరమైతే ఒక వెయ్యి.. రెండు వేల కోట్లు ఖర్చు పెట్టయినా సరే పరిష్కరిస్తాం. చాలా అధునాతమైన పరికరాలు వచ్చినయ్‌. జీపీఎస్‌ సిస్టమ్స్‌ వచ్చినయ్‌. వాటి ద్వారా ఎక్కడ అవసరం పడితే అక్కడ సర్వే చేయించి భూ సంబంధమైన పంచాయితీ లేకుండా చేసే బాధ్యత నాది. నేను ఒక జిల్లాకు రెండు, మూడ్రోజులు వస్త. వాళ్లను వీళ్లను నమ్మదల్చుకోలేదు నేను, చీఫ్‌ సెక్రటరీ నుంచి మొదలుకుంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్‌ను మొత్తం తీసుకునివచ్చి ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజలందరిని పిలిపించి ఏ గుంట భూమి గురించి కూడా.. ఏ రైతుకు బాధ లేకుండా ఎవరి భూమి ఉందో వాళ్లకు నిర్దారణ చేసి ఇస్తం’అని పేర్కొన్నారు.

నేను రైతు బిడ్డనే.. వ్యవసాయం చేసేవాడినే..
‘ఇంకో విప్లవాత్మకమైన ఆలోచన చేస్తున్నం. ఇండియాలో ఇంత వరకు లేదు. ఇప్పటి దాకా మన చట్టాల్లో లేదు. కన్‌క్లూజీవ్‌ టైటిల్‌. అంటే పూర్తి యాజమాన్య పట్టా. పూర్తి యాజమాన్యం ఉండి, ఆ యాజమాన్యం తప్పు అని తేలితే గవర్నమెంటే జరిమానా కట్టాలి. అందుకు భయపడి మన చట్టాల్లో పెట్టలేదు. ఎక్కడ కన్‌క్లూజీవ్‌ టైటిల్‌ లేదు. కన్‌క్లూజీవ్‌ టైటిల్‌ తేవడానికి, ప్రక్షాళన కావడానికి ఆలోచన చేస్తున్నా. దీంతో బ్యాంకు లోనుకు పోయినా పహాణీ నకలు తేవాల్సిన అవసరం ఉండదు. అంత కంప్యూటర్‌లోనే ఉంటుంది. వీటన్నింటిని చేయాలంటే రెవెన్యూ యాక్టును పూర్తిగా మార్చాలి. పాత పద్ధతి పోవాలి. అసలు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ పేరే బేకార్‌ పేరు ఉన్నది. ఎందుకంటే ఎనకట రెవెన్యూ అంటే శిస్తు వసూలు చేసేది. ఇప్పుడు శిస్తు ఎక్కడిది? ఉల్టా ప్రభుత్వమే రైతులకు ఇస్తుంటే ఇంక వసూలు ఎక్కడిది? డిస్ట్రిక్ట్‌ కలెక్టర్‌ అంటే ఏందీ? కలెక్ట్‌ చేసే వారు అని అర్థం. అది బ్రిటీష్‌ కాలంనాటి పేరు. జిల్లా పరిపాలన అధికారి అని పేరు మార్చాల్నా.. అది కూడా ఆలోచన చేస్తాన్నం. నీటి తీరువా కూడా తీసేసినం. ఇవన్ని ఎందుకు తీసిసనవ్‌ కేసీఆర్‌ అంటే... నేను కూడా ఒక కాపోన్ని కాబట్టి. నేను కూడా వ్యవసాయం చేస్త కాబట్టి. తెలంగాణలో రైతుల పరిస్థితి బాగుచేయటానికే సమూల సంస్కరణలు తీసుకొస్తా’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మనల్ని గోల్‌మాల్‌ చేయడానికే!
ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కచ్చితంగా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మనం చెబుతా ఉన్నాం. పోయిన సారి చెప్పినం. మన్మోహన్‌సింగ్‌ గారికి.. కానీ ఆయన వినలె. నరేంద్రమోడీకి గారికి అయితే నేను ఒక వందసార్లు చెప్పిన. ఆయన కూడా వినలే. వినరు. వారు పెడ చెవిన పెడతరు. అందుకే నేను చెబుతున్నా.. ఈ పెడచెవిన పెట్టెటోళ్ల చెంపలు వాయించి సెంటర్‌లో ఫెడరల్‌ ఫ్రంట్‌ గవర్నమెంట్‌ రావాలె. రాష్ట్రాల మాట చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం రావాలె. అది రావాలంటే తెలంగాణలోని 16 సీట్లు గెలవాలె. ఇంకో మాట మీరు ఆలోచన చేయాలి దయచేసి. ఇయ్యాల మోదీ, రాహుల్‌ ఇద్దరూ ఒక్కోళ్లను ఒక్కోళ్లు తిట్టుకుంటుండ్రు. పెడబొబ్బ పెడుతూ.. వారే బజారున పడి వీరంగం ఆడుతున్నరు. ఇందతా ఎందుకంటే. మనల్ని గోల్‌మాల్‌ చేయడానికే. ఎవరు పారిపాలించారండి దేశాన్ని 66 ఏళ్లు? కాంగ్రెస్, బీజేపే కాదా? ఇంకా వేరేవారు ఎవరో పరిపాలించినట్టు.. బద్నాం చేసే పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నరు. ఇవన్నీ ఆలోచించి నా బిడ్డ మాలోతు కవితను భారీ మెజార్టీతో గెలిపించాలి’అని కేసీఆర్‌ కోరారు. ఈ సభలో టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మానుకోట పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, మాజీ మంత్రి చందూలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top