టీఆర్‌ఎస్‌పై ఫైర్‌ అయిన విజయశాంతి

Vijayashanti Fires On TRS In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఓ పక్క విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతుంటే.. టీఆర్‌ఎస్‌ పార్టీలో మాత్రం గులాబీ జెండాకు ఓనర్‌ ఎవరని నాయకులు వాదించుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి విమర్శించారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసిన విజయశాంతి.. గులాబీ జెండా ఓనర్‌ ఎవరనే కొట్లాటలో పడి నేతలు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. రాజకీయాల్లోనూ పాలనాపరంగా అందరి కంటే తనకు ముందుచూపు ఉందని ప్రకటించుకునే కేసీఆర్.. ప్రజల సమస్యల విషయంలో మాత్రం ఎందుకు జాగ్రత్త చేర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ఆరోగ్య సమస్యలను కారణంగా చూపి తనను బలిపశువును చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తన సన్నిహితులతో వాపోయినట్లు వార్తలు వచ్చాయని ఆమె తెలిపారు. అందుకే జ్వరాలతో జనం ఆస్పత్రుల్లో బారులు  తీరుతున్నా, ఆరోగ్య శాఖ మంత్రి దీనిని పెద్ద సీరియస్‌గా తీసుకోవడం లేదని మండిపడ్డారు. నగరంలో పారిశుద్ధ్య లోపం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నాయని తెలిసినా కుడా గురువారం జీహెచ్‌ఎంసీలో సమావేశం నిర్వహించిన వైద్యశాఖ మంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనుసన్నల్లోనే జీహెచ్ఎంసీ, మున్సిపల్ వ్యవస్థ నడుస్తోందన్నారు. ఓ వైపు ఇంత దారుణం జరుగుతున్నా మాజీ మంత్రి హరీశ్‌రావు మాత్రం సందట్లో సడేమియా అన్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన అనుచరులతో వెయ్యి కొబ్బరి కాయలు కొట్టించి ముఖ్యమంత్రి అవ్వాలని మెక్కులు చెల్లిస్తూ.. చాప కింద నీరులాగా పావులు కదుపుతున్నారని అభిప్రాయపడ్డారు. బంగారు తెలంగాణ సాధిస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌​.. అధికార దాహంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top