‘హోదా అంశాన్ని అఖిలపక్షంలో లేవనెత్తాం’

Vijayasai Reddy Says Special Category Status Is Important To YSRCP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి జరగనున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ ముగిసింది. ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి హాజరు అయ్యారు. భేటీ అనంతరం విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలను అమలు చేయాలని అఖిలపక్ష సమావేశంలో కోరామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని సమావేశంలో లేవనెత్తామన్నారు. బీసీ సంక్షేమానికి పెద్దపీట వేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. గతంలోనే  చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కోసం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టామని, అవసరమైతే రాజ్యాంగం లోని 9 షెడ్యూల్ సవరించాలని కోరామన్నారు. అవసరాన్ని బట్టి దేశానికి, విశాల ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడే అంశాలపై ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని తెలిపారు.  లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌పై తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. ప్రత్యేక హోదానే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని, అది వచ్చిన తర్వాతే మిగిలిన అంశాల గురించి పరిశీలిస్తామని పేర్కొన్నారు.

రాజకీయ పార్టీల అధ్యక్షులకు మంత్రి ప్రహ్లాద్‌ జోషి లేఖ
ఈ నెల 19న ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి లేఖ రాశారు. ఐదు అంశాలపై ఈ సమావేశంలో చర్చింస్తామని చెప్పారు. వివిధ పార్టీల అధ్యక్షులు తమ అభిప్రాయాలను సమావేశంలో వెల్లడించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారని లేఖలో పేర్కొన్నారు. కేంద్రం చర్చించనున్న ఐదు అంశాలు..

  1. పార్లమెంట్‌ పనితీరు, మెరుగుదల
  2. ఒకే దేశం..ఒకే పన్ను
  3. అత్యంత వెనుకబడిన జిల్లాల అభివృది
  4. 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలు, నవభారత నిర్మాణం కోసం సంకల్పం
  5. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల పై చర్చ
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top