
అనంతపురం: సీఎం చంద్రబాబునాయుడు ప్రజలకు చెప్పేదొకటి, చేసేదొకటి అని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసగించారని మండిపడ్డారు. శింగనమల నియోజకవర్గమంత కూడా లేని సింగపూరుకు రైతులను తీసుకెళ్లారని, దానివల్ల ఏమి ప్రయోజనమని ప్రశ్నించారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ పరిస్థితుల్లో ప్రజలు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ చేపట్టబోయే పాదయాత్రకు సంఘీభావంగా పార్టీ నాయకుడు వైవీ శివారెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 3న పూజలు, అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్త నదీంఅహమ్మద్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాల్లో మార్పు తెస్తున్నారన్నారు.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జిల్లా నలుమూలలా వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామన్నారు. జగన్ పాదయాత్రకు సంఘీభావంగా అర్బన్ నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 3న సర్వమత ప్రార్థనలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం పార్టీ కార్యాలయం నుంచి సుభాష్ రోడ్డులోని వైఎస్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నివాళులర్పించిన తర్వాత మసీదు, శివాలయం, చర్చిలో పూజలు చేస్తామన్నారు. అనంతరం చెరువుకట్ట శివాలయం వద్ద శివారెడ్డి అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. నాయకుడు వైవీ శివారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, నాయకులు గోపాల్, శీనా, లింగారెడ్డి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.