ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా ?

vennapusa gopal reddy fired on cm chandra babu - Sakshi

కడప సభలో సీఎం దిగజారుడుతనం సిగ్గుచేటు

ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ‘జన్మభూమి’ సభలో సమస్యలపై మాట్లాడితే మైకు లాక్కునే స్థాయికి సీఎం దిగజారడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం ఆయన వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమం పెద్ద ప్రహసనంగా మారిందన్నారు. ప్రతిసారీ పింఛన్, ఇళ్లస్థలాల కోసం అర్జీలు తీసుకోవడం... వాటిని చెత్తబుట్టపాలు చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటైపోయిందన్నారు.

పోలవరం, ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌ సాధన, కడప స్టీల్‌ పరిశ్రమ ఏర్పాటు వంటి ప్రధాన సమస్యలపై పట్టించుకోకుండా... ‘జన్మభూమి’ సభల  ద్వారా సీఎం ప్రజలను మాయ చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును 2017 కల్లా పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు... ప్రస్తుతానికి దిమ్మెలు కూడా కట్టలేదన్నారు.  పోలవరం 2022 నాటికైనా పూర్తవుతుందో..? కాదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇక  దుర్గగుడిలో తాంత్రిక పూజలపై రిటైర్డ్‌ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి పేరిట చంద్రబాబు సర్కార్‌ దేవాలయాలు, మసీదులు, గాంధీ విగ్రహాలను కూల్చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, అందువల్లే మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయన్నారు. వీటిని నియంత్రించాల్సిన లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైందన్నారు. 

విద్యావ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర
పాఠశాల ఉపాధ్యాయులను నోడల్‌ అధికారులుగా నియమించి పాఠశాల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని గోపాల్‌రెడ్డి విమర్శించారు. బయోమెట్రిక్‌ విధానం ద్వారా ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేయడం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. గతంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారనీ, అయితే దోమలు పోలేదు కానీ విద్యార్థులు చదువులు మాత్రం నాశనం అయ్యాయన్నారు. దోమలపై దండయాత్ర చేసే బదులు వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని హితవుపలికారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరా, పార్టీ నగర అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డిలు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top