వీధి రౌడీల్లా మీసాలు మెలేస్తారా : వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma Fires On TDP Leaders Over Illegal Constructions Demolition - Sakshi

సాక్షి, విజయవాడ : గత ప్రభుత్వ అవినీతి పుట్టలు బద్దలవుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. గురువారమిక్కడ ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. చంద్రబాబు ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. ఆయన విధానాల వల్ల విద్యుత్‌ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అవినీతి రహిత పాలన అందించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. అక్రమ కట్టడాలపై సీఎం జగన్‌ చర్యలు తీసుకుంటే.. టీడీపీ నేతలు వాటిని ఒక యుద్ధంలా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని, పోలవరం, భూకేటాయింపులు సహా అన్నింటిలోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు.

వీధి రౌడీల్లా మీసాలు మెలేస్తారా?
‘తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. గత ప్రభుత్వ పథకాలపై సీఎం జగన్‌ సమీక్షలు చేస్తూంటే అనేక అక్రమాలు బయట పడుతున్నాయి. చంద్రబాబు హయాంలో విద్యుత్ ఒప్పందాలపై రూ. 18 వేల కోట్లు బకాయిలు ఉన్నాయంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్ధమవుతోంది. ముఖ్యమంత్రి అంటే కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. అక్రమమే అని ఒప్పుకుంటారు.. చర్యలు తీసుకోవద్దంటారు. అక్రమ కట్టడాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎందుకు అవహేళనగా మాట్లాడుతున్నారు. మీకు ఇది‌ సమంజసమేనా’ అని వాసిరెడ్డి పద్మ టీడీపీ నేతలను ప్రశ్నించారు. ‘చంద్రబాబు భద్రతపై పదేపదే మాట్లాడుతున్నారు.. ప్రతిపక్ష నాయకులకు ఇవ్వాల్సిన భద్రతను ఆయనకు కచ్చితంగా కేటాయిస్తారు. ఇవన్నీ మరచి వీధి రౌడీల్లా మీసాలు మెలేస్తారా.. పలు అక్రమాలపై విచారణ జరుపుతామన్నా.. క్యాబినెట్ సబ్ కమిటీ వేసినా అసలు మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు’ అని టీడీపీ నేతల తీరును ఎండగట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top