అవి హిందుత్వ కుట్రలే

Varavara rao about social media attacks on sandya - Sakshi

‘సోషల్‌’ దాడులపై వరవరరావు  

హైదరాబాద్‌: నాలుగు దశాబ్దాలుగా సామాజిక సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఎందరో మహిళలకు అండగా ఉంటున్న ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్‌ వి.సంధ్యపై సోషల్‌ మీడియాలో దాడులు హిందుత్వ కుట్రేనని విరసం నేత వరవరరావు విమర్శించారు. సంధ్యపై సోషల్‌ మీడియాలో వస్తున్న బెదిరింపులను నిరసిస్తూ గురువారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్‌యూ, ఐఎఫ్‌టీయూ, పీవోడబ్ల్యూ, ఏఐకేఎంఎస్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వరవరరావు మాట్లాడుతూ దాడుల వెనకాల మోదీ ప్రభుత్వం నిలబడిందని ఆరోపించారు.

సంధ్యపై సోషల్‌ మీడియాలో వస్తున్న బెదిరింపులు, అశ్లీల మాటలను పోలీసులు సైబర్‌ నేరం కింద పరిగణించకపోవటాన్ని బట్టి ఈ వ్యవస్థ ఎవరి అధీనంలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కర్ణాటకలో సీనియర్‌ జర్నలిస్టు గౌరీలంకేశ్‌ను హత్య చేశారని, సంధ్య, సూరెపల్లి సుజాత, దేవి వంటి సామాజిక కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగాప్రజల హక్కులను కాలరాస్తున్నారని, స్వామి అగ్నివేశ్‌పై దాడి చేయటం దుర్మార్గమని ప్రొఫెసర్‌ రమా మెల్కొటే అన్నారు. రేటింగుల కోసం దేవి, సంధ్యలను చానళ్లు పిలుస్తాయే తప్ప, వారిపై దాడులు జరుగుతుంటే పట్టించుకోవని దేవి విమర్శించారు.

సోషల్‌ మీడియా ద్వారా దాడులు చేస్తున్న దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే న్యాయపరమైన పోరాటానికి సిద్ధం కావాలని ‘ఆంధ్రజ్యోతి’ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. రాజ్యం తనపై ఎన్నోసార్లు దాడులు చేసిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో మహిళల హక్కుల కోసం పోరాడుతుంటే తన ఉద్యోగాన్ని సైతం తీసేశారని సంధ్య గుర్తుచేశారు. దాడులు, అణచివేతలు కొత్త కాదని, హిందుత్వ కుట్రలను సైతం ఎదుర్కొంటామన్నారు. కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్, ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు, సామాజికవేత్త ఉ.సాంబశివరావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, సామాజిక కార్యకర్త సజయ, పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు జి.లక్ష్మణ్, టఫ్‌ అధ్యక్షురాలు విమల, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top