‘సినిమా చూపిస్తున్న కేసీఆర్‌’

v hanumantha rao comments on kcr - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ సూపర్‌​ స్టార్‌ రాజ్‌కపూర్‌ సినిమా కంటే గొప్ప సినిమాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చూపిస్తున్నారంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి హనుమంతరావు విమర్శించారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ నేతలను సస్పెండ్‌ చేయడంపై ఆయన పై విధంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంత పెద్ద డ్రామా తాను ఇంతవరకు చూడలేదని, కేవలం గౌడ్‌ సామాజిక వర్గం ఓట్ల కోసమే స్వామిగౌడ్‌కు దెబ్బ తగిలినట్టు నాటకం ఆడిస్తున్నారని ఆరోపించారు. ఇయర్ ఫోన్స్‌తో అసలు దెబ్బ తగులుతుందా, ఇదంతా జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇస్తానని తానే మూడు ఇళ్లు కట్టుకున్నారని, ఒక ముఖ్యమంత్రికి అన్ని ఇళ్లు ఎందుకని విమర్శించారు. గిట్టుబాటు ధర లేదని రైతులు ఆందోళన చేస్తే వారిని అరెస్టు చేయించిన కేసీఆర్‌కి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రశ్నించిన ప్రతిపక్ష సభ్యులందరిని సభ నుంచి సస్పెండ్‌ చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల ఫలితాలపై వీహెచ్‌ మాట్లాడుతూ.. భారతీయ జనత పార్టీ పతనం ప్రారంభమైందని అన్నారు. 2019లో కేంద్రంలో, రాష్టంలో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెరాస ఎంపీలు రిజర్వేషన్‌ కోటా పెంచాలని డిమాండ్‌ చేస్తుంటే, కేసీఆర్ మాత్రం ఇక్కడ సర్పంచ్‌, కార్పొరేటర్లలకు అధికారం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్‌ పెంపు సాధ్యం కాదని తెలిసే టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళన చేస్తున్నారని అన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ సాధ్యం కాదని అసదుద్దీన్‌ ఎందుకు మద్దతు ఇస్తున్నారని, ఆయన ఎందుకు ఢిల్లీ రాలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో తెరాస ఎంపీలు చేసేదంత ఒక డ్రామా అని అన్నారు. సమగ్ర సర్వే చేయించిన కేసీఆర్‌కు బీసీలకు ఎంత రిజర్వేషన్‌ ఇవ్వాలో తెలియదా అని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top