4 నెలలు..12 శాతం రిజర్వేషన్లు..ఏమయ్యాయ్‌!

Uttam Kumar Reddy Slams KCR in Hyderabad - Sakshi

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ముస్లింలకు 4 నెలల్లో 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానన్న కేసీఆర్‌..నాలుగేళ్లయినా రిజర్వేషన్లు ఎందుకు అమలుచేయడం లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. నాంపల్లి రెడ్‌రోజ్‌ ఫంక్షన్‌ హాల్లో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు, కాంగ్రెస్‌ అగ్రనేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, భట్టి విక్రమార్క, జైపాల్‌ రెడ్డి, పలువురు ముస్లిం పెద్దలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ..ముస్లింలను మోసం చేసిన కేసీఆర్‌కు ముస్లింలు ఓటెయ్యాలా అని సూటిగా ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు విషయం తెలియగానే కేసీఆర్‌ మొట్టమొదట మద్ధతు పలికారని, మోదీతో కేసీఆర్‌ రహస్య ఒప్పందంతో ముందుకెళ్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్‌, ఓవైసీ పరోక్షంగా ప్రధాన మంత్రి మోదీకి మద్ధతు పలుకుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. భారతదేశంలో మోదీ పీఎం అయిన తర్వాత మైనార్టీలు అభద్రతా భావంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top