కేసీఆర్‌ది అహంకారం | Uttam Kumar Reddy Fires On KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది అహంకారం

May 7 2020 2:01 AM | Updated on May 7 2020 4:03 AM

Uttam Kumar Reddy Fires On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా తమ పార్టీ నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అహంకారపూరితమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీని అవమానించినట్టేనని, పార్టీపరంగా, వ్యక్తిగతంగా దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వాళ్లం తామైతే, అడ్డగోలుగా అక్రమ సంపాదనతో కోట్లు దోచుకుంది కేసీఆర్‌ కుటుంబమని ఆరోపించారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదని, సీఎం స్థాయిని మరిచి కేసీఆర్‌ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వీహెచ్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఏఐసీసీ కిసాన్‌సెల్‌ వైస్‌చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు.

ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోన్న తాము దద్దమ్మలం, సన్నాసులం, బఫూన్‌లమైతే అసెంబ్లీ సాక్షిగా పారాసిటమాల్‌తో కరోనా పోతుందన్న వాళ్లను దద్దమ్మ అనాలా?, బఫూన్‌ అనాలా? లేక ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ నీళ్లివ్వకుండా ఓట్లడిగిన వాళ్లని సన్నాసులు, దద్దమ్మలు అనాలా? అని నిలదీశారు. లగ్జరీ జీవితానికి అలవాటుపడ్డ కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాము గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలోని పరిస్థితుల్ని వివరిస్తే ఆయనకొచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. కరోనా మరణాల సంఖ్య రాష్ట్రంలో ఎక్కువగా లేదని చెప్పడానికి కేసీఆర్‌కు సిగ్గుండాలన్నారు. కేసులు, మరణాల రేటు గురించి మాట్లాడిన కేసీఆర్‌ కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య విషయంలో ఇతర రాష్ట్రాలతో, కేంద్రంతో ఎందుకు పోల్చుకోరని ప్రశ్నించారు.

ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యానికి కేంద్రం ప్రకటించిన రూ.1,800కు మరో రూ.700 కలిపి మొత్తం రూ.2,500కు కొనుగోలు చేస్తున్నారని, కేసీఆర్‌కు దమ్ముంటే తనతో కలిసి ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ రావాలని ఉత్తమ్‌ సవాల్‌ విసిరారు. రైతుబంధు గురించి మాట్లాడుతున్న కేసీఆర్‌ ఏ పంటకు ముందు రైతుబంధు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రెండోసారి ఏర్పడి ఇన్ని రోజులైనా రుణమాఫీ చేయలేదని, పంటలు ఎప్పుడు చేతికి వస్తాయో, బస్తాలు ఎప్పుడు తెప్పించాలో తెలియని దద్దమ్మలు మమ్మల్ని విమర్శిస్తారా అని ధ్వజమెత్తారు. తెలంగాణలో వలస కార్మికులు ఎంతమందో చెప్పలేని ప్రభుత్వం వాళ్లను ఆదుకుంటుందా అని ప్రశ్నించారు. బత్తాయి ఆరోగ్యానికి మంచిదని చెప్పిన కేసీఆర్‌ ఎందుకు బత్తాయిలను ప్రభుత్వ పక్షాన కొనుగోలు చేయట్లేదని ప్రశ్నించారు. రెడ్‌జోన్లలో కూడా వైన్స్‌ తెరిచిన కేసీఆర్‌కు వైన్‌షాపులపై ఎందుకంత ప్రేమని ఎద్దేవా చేశారు. అధికారంలో లేకున్నా రాష్ట్ర ప్రజల కోసం తాము పోరాడుతామన్నారు.

రైతులు తాలుగాళ్లయ్యారా? 
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ జాగీరు కాదన్న విషయాన్ని గ్రహించాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రైతుల గోస ఊరికేపోదని, సీఎంకు రైతులు తాలుగాళ్లయ్యారా అని ప్రశ్నించారు. కిసాన్‌సెల్‌ నేత కోదండరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాలుగుసార్లు కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తే ఒక్కసారీ రైతుల పంట నష్టం గురించి మాట్లాడలేదని ఎద్దేవా చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement