ఏపీ బాగుపడాలంటే 2019 ఎన్నికలు చాలు..

Undavalli Asks People To Not To Cast Vote For Who Gives Note - Sakshi

వెంట్రుక ముడేసి కొండను లాగుతారా?

ఖర్చుపెట్టిన వాడు ఓడిపోవాలి

సాక్షి, రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్‌ బాగు పడాలంటే ఒక్క 2019 ఎన్నికలు చాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు ఇచ్చిన వాడికి ఓటెయ్యెద్దని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. డబ్బు ఖర్చు పెట్టినవాడు ఈ ఎన్నికల్లో ఓడిపోయి తీరాలని, అప్పుడే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

ఆయన మంగళవారం రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘గత నాలుగేళ్లలో రాష్ట్రానికి అక్షరాలా 18 లక్షల 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పారు. ఇది దేశం మొత్తంలో వస్తున్న పెట్టుబడుల్లో 20 శాతం. ఇంతగా భారీగా పెట్టుబడులు వస్తున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని, పన్ను రాయితీలు కావాలని ఎలా అడుగుతారు?. ఎప్పుడైనా ఎక్కడైనా అధికారిక పార్టీ విఫలం చెందడానికి ప్రతిపక్షం కారణమని చెప్పడం చూశారా?. టీడీపీ ఇలా చెప్పడం విడ్డూరం. గత ఐదేళ్లుగా పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోంది. అసలు మనకున్న అధికారాలేంటి? రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్న సంబంధాలేంటి? తెలుసా మీకు. మనది ఫెడరల్‌ వ్యవస్థ అని మాట్లాడుతున్నారు. మనది ఫెడరల్‌ వ్యవస్థ కాదు. మనది యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌. మొత్తం బలం(అవశిష్ట అధికారాలు) కేంద్ర ప్రభుత్వం వద్దే ఉంది.

రాష్ట్రాన్ని విడగొట్టాలన్నా, ఏదైనా రాష్ట్రానికి కేటాయింపులు చేయాలన్నా మొత్తం వారి చేతిలోనే ఉంది. తీసుకున్న నిర్ణయాలను మళ్లీ ఉపసంహరించుకోవచ్చు కూడా. మనకు ఏ హక్కు ఉందని ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తున్నాం? ఏ హక్కుతో ప్రత్యేక హోదా ఇవ్వాలని రాబోయే ప్రభుత్వాలు కేంద్రాన్ని అడగబోతున్నాయి. ప్రత్యేక హోదాను ఎలా సాధించబోతున్నారో చెప్పాలి.

మాకు ఓటేయండి అని అడిగేప్పుడు ప్రత్యేక హోదా ఇలా సాధిస్తాం అని ప్రజలకు వివరించండి. ఏదో ఒకటి చెప్పండి మా దగ్గర వెంట్రుక ఉంది.. వెంట్రుకను ముడేసి కొండను లాగుతామని చెప్పండి చంద్రబాబు. ఎన్నికలకు అప్పుడే ఆశావాహులు రెడీ అవుతున్నారు. ఓటుకు కనీసం రెండు వేల చొప్పున ఇవ్వాలట. ఉన్నవాళ్లు ఆస్తులు అమ్మడానికి లేనివాళ్లు అప్పులు చేసి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు.

ఓటుకు కనీసం రెండు వేలు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌ బాగు పడాలంటే రాబోయే ఒక్క ఎలక్షన్‌ చాలు. ఈ ఒక్క ఎలక్షన్‌లో డబ్బు ఇచ్చిన వాడికి ఓటెయ్యెద్దని ప్రజలందరినీ కోరుతున్నా. డబ్బు ఖర్చు పెట్టినవాడు ఓడిపోవాలి. ఇది చిన్న విషయం కాదు. మోసం రాజకీయ నాయకులు చేయగలరేమో కానీ పేదవాడు చేయలేడు. లోపలికి వెళ్లి మిషన్‌ స్విచ్‌ నొక్కే సమయంలో అంతరాత్మను పేదవాడు మోసం చేయలేడు.’ అని ఆయన అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top