నా వాదన తప్పని నిరూపిస్తే క్షమాపణ చెబుతా

Undavalli Aruna Kumar challenge to Kutumba Rao - Sakshi

     కుటుంబరావుకు ఉండవల్లి సవాల్‌ 

     అమరావతి బాండ్లకు 10.36% వడ్డీ ఎలా ఇస్తారంటూ ప్రశ్న

     సీఆర్‌డీఏను కంపెనీగా మార్చుకోవాలని ఎద్దేవా

     రూ.18 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ఎక్కడ వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ 

సాక్షి, రాజమహేంద్రవరం: అమరావతి బాండ్లు, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, ఇళ్ల నిర్మాణాలు, రూ.18 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు తదితర అంశాలపై చర్చకు రావాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మరోసారి సవాల్‌ విసిరారు. తన వాదన తప్పని నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణ చెబుతానని పునరుద్ఘాటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటాల్లోనే..

ఈ అంశాలపై స్పష్టత ఇవ్వండి...
- అమరావతి బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్ల అప్పుకు 10.36 శాతం వడ్డీ ఎలా ఇస్తారు? ఆరు నెలల ముందు 8 శాతం కన్నా ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకోకూడదని మీరే జీవో నంబర్‌ 68 జారీ చేశారు. మరి 10.36 శాతం వడ్డీకి ఎలా రుణం తీసుకుంటారు. అమరావతి బాండ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పండి. అధిక వడ్డీకి బాండ్లు జారీ చేసే కన్నా బ్యాంక్‌ ఇచ్చే వడ్డీకి పావలా అధికంగా ఇచ్చినా రూ.2 వేల కోట్లను రాష్ట్ర ప్రజలు ఇస్తారు కదా. అధిక వడ్డీకి అప్పులు చేయడమే కాకుండా బీఎస్‌ఈలో గంట కొట్టేందుకు రూ.1.8 కోట్లు ఖర్చు చేస్తారా? 
పోలవరం ప్రాజెక్టులో పనులు చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నారని గతంలోనే చెప్పా. ఇప్పుడు అదే విషయంపై గొడవ జరుగుతోంది. పనులు లేకుండానే, ఎం బుక్స్‌లో రాయకుండానే బిల్లులు చేసుకున్నారు. 
పట్టిసీమ ప్రాజెక్టులో 22% అదనపు చెల్లింపులు ఎలా చేస్తారు? వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో అదనపు చెల్లింపులు 5 శాతం కన్నా ఎక్కువ చేయలేదు. ఎత్తిపోతల పథకాల్లో చెల్లింపులపై చర్చించేందుకు సిద్ధమా? 
పేదలకు అపార్ట్‌మెంట్‌లలో నిర్మించి ఇచ్చే ఇళ్ల చదరపు గజం ధర రూ.2,939ని మంత్రి నారాయణ చెబుతున్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరేమో చదరపు గజానికి రూ.1,500తో హై క్లాస్‌లో అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారు. మరి పేదలకు ఇచ్చే ప్లాట్లకు అంత పెద్ద మొత్తం ఎలా ఇస్తున్నారో చెప్పండి.
విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుల ద్వారా రూ.18 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు వచ్చాయని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అవి ఎక్కడ ఉన్నాయో చూపించండి. 
మీరు ప్రచురించిన ‘రాజా ఆఫ్‌ కరప్షన్‌’ పుస్తకంపై చర్చిద్దాం రండి. వైఎస్‌ ఎక్కడ అవినీతి చేశారో చూపించండి. 

అప్పు కోసం ప్రత్యేక విమానాల్లో వెళతారా? 
అప్పు కోసం ఆడీ కార్లలో, ప్రత్యేక విమానాల్లో వెళతారా? అలా వెళితే ఎవరైనా అప్పిస్తారా? సీఆర్‌డీఏను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థగా కాదు, కంపెనీగా పేరు మార్చుకోండి. కుటుంబరావు చెప్పినట్లు మార్గదర్శిలో తప్పులేకపోతే డబ్బులు తిరిగి ఎందుకు ఇచ్చారు? కోర్టులో ఉన్న మార్గదర్శి కేసును మళ్లీ కదిలిస్తా. 30 ఏళ్లలో హెరిటేజ్‌ విలువ ఎప్పుడెప్పుడు పెరిగిందో నేను చెబుతా. ఆయా సమయాల్లో ఏఏ ప్రభుత్వ డెయిరీలు మూత పడ్డాయో కూడా చూపిస్తా. చర్చకు రావాలి’ అని కుటుంబరావుకు ఉండవల్లి సవాల్‌ విసిరారు. సమావేశంలో అశోక్‌కుమార్‌ జైన్, చెరుకూరి రామారావు, అల్లుబాబి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top