జిన్నా తాత రాజ్‌పూత్‌ వంశీయుడు: ఉండవల్లి

Undavalli Arun Kumar Slams Modi Govt Over Kashmir Row - Sakshi

సాక్షి, రాజమండ్రి : గాంధీజీ- నెహ్రూ వేర్వేరు కాదని.. గాంధీ ఏం చెప్పారో.. నెహ్రూ అదే చేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌లో కర్ఫ్యూ నడిపిస్తోందని విమర్శించారు. మంగళవారం ఉండవల్లి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసలు కశ్మీర్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదని.. అక్కడికి ఎవరినీ వెళ్లనీయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. ‘పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మనదేనని అమిత్‌ షా చెబుతున్నారు. పాకిస్తాన్‌ కూడా మనదే. గాంధీని, నెహ్రూను, కాంగ్రెస్‌ పార్టీని అంబేద్కర్‌ ఎన్నడూ సమర్థించలేదు... ఆయన వాస్తవాలను మాత్రమే చెప్పారు. నిజానికి ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తాననడంలో తప్పులేదు. బీజేపీ పుట్టిందే ఈ సిద్ధాంతం మీద. ఆర్టికల్‌ రద్దు అనేది డిప్లమసీతో చేయాలి. సైన్యంతో కాదు’ అని మోదీ సర్కారు తీరును విమర్శించారు.

ఆయన బ్రాహ్మణుడే
పాకిస్తాన్‌ జాతిపిత మహ్మద్‌ జిన్నా తాత రాజ్‌పూత్‌ వంశానికి చెందినవారు. అబ్దుల్‌ భట్‌ కూడా బ్రాహ్మణుడే. వీరంతా ఇస్లాంలోకి వెళ్లినవారే. సాయిబాబా గుడికి వెళ్లొద్దని శంకరాచ్యా పీఠాధిపతే చెప్పారు. నల్లధనానికి నోట్లరద్దు ఎలా పరిష్కారం కాదో... ఉగ్రవాద సమస్యకు ఇప్పుడున్న పరిస్థితి పరిష్కారం కాదు. అంతేకాదు ఈరోజు గూగుల్‌ సెర్చ్‌లో ఆర్టికల్‌ 370 అనేది లేదు. కశ్మీర్‌ ఎంపీలు కూడా భారత రాజ్యాంగం మీదనే ప్రమాణం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం గాంధీ సిద్ధాంతానికి విరుద్ధంగా పనిచేస్తోంది’ అని విమర్శలు గుప్పించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top