ఓటమి భయంతోనే బాబు రగడ 

Ummareddy venkateswarlu fire on chandrababu behaviour - Sakshi

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ప్రతి దానికీ పెద్ద ఎత్తున రగడ చేస్తున్నారని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడతలోనే ఎన్నికలు జరిగేలా షెడ్యూల్‌ ప్రకటించిన ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు తొలుత తప్పుపట్టారని, ఇప్పుడు తొలి విడతలో ఎన్నికలు జరగడం వల్ల తమకు మేలు జరిగిందంటూ యూటర్న్‌ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ఓడిపోయి, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తోందని చంద్రబాబుకు తెలిసిపోయిందని, అందుకే ప్రతి దానికీ పెద్ద రగడ సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మారెడ్డి ఏం

మాట్లాడారంటే...  చంద్రబాబు కోపానికి అదే కారణం  
‘‘చంద్రబాబు అవకతవకలు, అవినీతి, ఆశ్రితపక్షపాతాన్ని ప్రజలు భరించే స్థితిలో లేరు. అందుకే వైఎస్సార్‌సీపీకి అధికారం కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు కోపానికి అదే కారణం. ఏ చిన్న అంశం దొరికినా వదలకుండా డ్రామాలాడుతున్నారు. ఏదో విధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని, వివిధ రాష్ట్రాల నేతలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు ఏ మాత్రం హేతుబద్ధంగా లేవు. ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో సమీక్షా సమావేశాన్ని ఎన్నికల సంఘం అనుమతితో నిర్వహించేందుకు వీలుంది. కానీ, చంద్రబాబు అధికార దర్పంతో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని అగౌరవపర్చాలని చూస్తున్నారు. ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఆపద్ధర్మ సీఎం ఆదేశాలను ఎలా పాటిస్తారు?  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోవర్టు అని, సహ నిందితుడని అభ్యంతరకర పదాలు వాడారు. తాను పిలిచినప్పుడల్లా సీఎస్‌ రావాలి, తాను చేయమన్నది చేయాలన్నట్లుగా బాబు అహంభావంతో ప్రవర్తిస్తున్నారు. వీవీప్యాట్లు, ఈవీఎంలపై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు పోలింగ్‌ రోజు చక్కగా ఓటేసి ఫొటోలకు పోజులిచ్చారు. రెండు గంటల తరువాత మాటమార్చి, తన ఓటు ఎవరికి పడిందో తనకే అర్థం కావడం లేదని నిట్టూర్పు విడిచారు. ఎన్నికలను వాయిదా వేయించాలనే దుష్ట సంకల్పంతోనే ఈవీఎంలు, వీవీప్యాట్లపై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు’’అని అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top