అయ్యో.. లోకేష్‌ అది కూడా తెలియదా?

Twitter Rost Chandrababu Son Nara Lokesh - Sakshi

ట్విటర్‌ వేదికగా నిలదీసిన నెటిజన్లు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌ ట్విటర్‌లో రెచ్చిపోయారు. వరుస ట్వీట్లతో లబోదిబోమని మొత్తుకున్నారు. ప్రత్యేక హోదా కోసం తాము ఇంత చేస్తుంటే ప్రతిపక్షనేత ఎక్కడ పడుకున్నారంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అయితే చినబాబు గారి ఈ తరహా పోస్ట్‌లపై ప్రజలు దిమ్మతిరిగే సమాధానం ఇస్తున్నారు. 

‘అయ్యా.. లోకేష్‌ సారూ.. మీరు గత నాలుగేళ్లుగా బీజేపీతో సంసారం చేసినప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదండీ?  ప్రతిపక్షనేత ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే కేసులు పెట్టి అడుగడుగున అడ్డుకుంది ఎవరండీ? ఇదే ప్రతిపక్ష నేత  ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ విశాఖలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళుతుండగా విమానాశ్రయంలోనే అడ్డుకుని అరెస్టులు చేసిందెవరండీ? ఆ సమయంలో మీరెక్కడ పడుకున్నారండీ? హోదా పేరు ఎత్తితే జైల్లో పెడ్తాం అని ఎవరన్నారండీ? ఆరోజు మీరు, మీ నాన్నగారు కేంద్రానికి వంతపాడుతూ ఏం మాట్లాడారండీ? హోదా వద్దు ప్యాకేజీ ముద్దని చెప్పిందేవరండీ? ఆ ప్రతిపక్షనేతే ఏడాదికి పైగా జనాల్లో ఉంటూ 3600 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయకుంటే మీరు హోదాపై యూటర్న్‌ తీసుకునేవారా? అండీ?’ అని ఆధారాలతో సహా నిలదీస్తున్నారు.

ఇక ప్రధాని మోదీ పర్యటనకు జనాలు లేకపోవడంతో ప్రతిపక్షపార్టీ తమ కార్యకర్తలను పంపిస్తోందని ఆటోలపై జగన్‌ స్కిక్కర్లున్న ఫొటోను ట్యాగ్‌ చేస్తూ చినబాబు గారు ట్వీట్‌ చేశారు. దీనిపై కూడా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘అయ్యో లోకేష్‌ సారూ.. మీకు ఇది కూడా తెలియదా? ఆటోలపై జగన్‌ స్టిక్కర్లు ఆ ప్రతిపక్ష నేతపై ఉన్న అభిమానంతో వేసుకున్నారు.. బీజేపీ మీటింగ్‌కు కూడు కోసం వెళ్లారు. ఏది ఏమైనప్పటికి మధ్యతరగతిలో వైఎస్‌ జగన్‌కు క్రేజ్‌ ఉందనే నిజం ఒప్పుకున్నావ్‌’ అని బదులిస్తున్నారు. ‘ఇప్పటికీ దేవాన్ష్‌ మోదీ తాత అని పిలుస్తున్నాడా.. సోనియా అమ్మమ్మ అంటున్నాడా?’ అని సెటైర్లేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top