ఎన్నికల వేళ ట్వీట్ల మోత

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్విట్టర్ ట్వీట్లతో మోగుతోంది. ఎన్నికలపై పలు సంభాషణలు, చర్చల ద్వారా గత వారంలో ఏకంగా 12 లక్షల ట్వీట్లు నమోదైనట్లు ట్విట్టర్ పేర్కొంది. ఎన్నికల కార్యక్రమాల్లో భాగంగా..ట్విట్టర్ రాష్ట్ర ఎన్నికల కోసం ఒక ప్రత్యేక ఎమోజి, హ్యాష్‌టాగ్‌తో ఎలక్షన్ ఆన్ ట్విట్టర్ ఈవెంట్స్‌ను రూపొందించింది. ప్రత్యక్షంగా ప్రశ్నలు అడిగే సౌకర్యాన్ని కూడా కల్పించింది. దీంతో డిసెంబర్ 23 వరకు ప్రజలకు ఈ ప్రత్యేక #AssemblyElections2018 అందుబాటులో ఉంటుందని ట్విట్టర్ తెలిపింది. దీని ద్వారా రాజకీయ నాయకులు, అభ్యర్థులు ఎన్నికల సమయం వరకు బహిరంగ సంభాషణలు జరపడానికి, వారు ప్రజలతో నేరుగా మాట్లాడి మద్దతు కూడగట్టడానికి అవకాశం ఉంటుంది.