 
													సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మకంగా మారిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌పై 40,707 ఓట్ల మెజారిటీతో దినకరన్ అఖండ విజయాన్ని సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దినకరన్ ప్రభంజనం ముందు ప్రత్యర్థి పార్టీలు కొట్టుకుపోయాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా బీజేపీ, ఇతర చిన్న పార్టీలు డిపాజిట్ కోల్పోయాయి.
దివంగత జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్.. హోరాహోరీగా సాగుతుందని అంతా భావించారు. కానీ, అధికార అన్నాడీఎంకే.. శశికళ వర్గం తరఫున బరిలోకి దిగిన టీటీవీ దినకరన్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. ఉప ఎన్నికలో కుక్కర్ గుర్తుతో పోటీచేసిన దినకరన్ మొదటినుంచి లీడ్‌లో కొనసాగుతూ.. ఇటు అధికార అన్నాడీఎంకే, అటు ప్రతిపక్ష డీఎంకే ఊహించనిస్థాయిలో భారీ విజయాన్ని అందుకున్నారు.
బీజేపీ కన్నా నోటాకే ఎక్కువ
ఈ ఎన్నికల్లో దినకరన్‌కు 89,013 ఓట్లు రాగా, అన్నాడీఎంకేకు 48,306 ఓట్లు వచ్చాయి. డీఎంకేకు 24,651 ఓట్లు, నామ్ తమిళార్ పార్టీకి 3,802 వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీకి ఈ ఉప ఎన్నిక ఏమాత్రం కలిసిరాలేదు. తమిళనాడు రాజకీయాల్లో మెరుగుపడాలని ఎంతగా తపిస్తున్నా.. కమళదళం ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అతికష్టం వెయ్యిమార్కును దాటింది. బీజేపీ అభ్యర్థికి 1,368 ఓట్లు రాగా, బీజేపీ కన్నా ఎక్కువగా నోటా (పైవారెవరూ కారు)కు 2,203 ఓట్లు వచ్చాయి.
ఆర్కే నగర్ ప్రజలకు ధన్యవాదాలు
తనను గెలిపించిన ఆర్కే నగర్ ప్రజలకు దినకరన్ కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ జయలలిత ఆశీస్సులు తనకు ఉన్నాయని, అందుకే ఆర్కే నగర్ తీర్పే నిదర్శమని అన్నారు. మూడు నెలల్లో అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. అమ్మ వారసురాలే చిన్నమ్మేనంటూ శశికళ వర్గం కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
