టీటీవీ దినకరన్‌కు పార్టీ పదవి

TTV Dinakaran Becomes General Secretary Of AMMK - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై:  అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)ను రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల క్రితం చెన్నై ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోదిగిన దినకరన్‌ ఆనాడు కుక్కర్‌ చిహ్నంపై పోటీ చేసి గెలుపొందారు.

తాజా లోక్‌సభ ఎన్నికల్లో సైతం తనకు కుక్కర్‌ గుర్తును కేటాయించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. అయితే రాజకీయ పార్టీగా రిజిస్టర్‌ చేయనందున అదే గుర్తును కేటాయించలేమని ఈసీ నిరాకరించింది. కుక్కర్‌ గుర్తు కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినపుడు రాజకీయ పార్టీగా ఈసీ వద్ద రిజిస్టర్‌ చేస్తానని కోర్టుకు చెప్పారు. తమిళనాడులో ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో గిఫ్ట్‌బాక్స్‌ గుర్తుపై స్వతంత్ర అభ్యర్థులుగా ఏఎంఎంకే నేతలు పోటీ చేశారు. ఈ మేరకు ముందుగా ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తదుపరి చర్యగా ఈసీకి దరఖాస్తు చేయనున్నారు. ఏఎంఎంకేను ఏర్పాటు చేసినపుడు ప్రధాన కార్యదర్శిగా శశికళ, ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్‌ వ్యవహరించారు. తాజా పరిణామం శశికళకు ఏఎంఎంకేలో స్థానం లేకుండా పోవడం గమనార్హం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top