
తలసాని శ్రీనివాస్ యాదవ్
. హుందాగా మాట్లాడటం గురించి మీరు మాకు నేర్పాలా
హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దేశ రాజకీయాల గురించి మాట్లాడితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్ధం కావడం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తలసాని విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్రం నిధులు ఇస్తుందని చంద్రబాబు ఈ రోజు ఒప్పుకున్నారు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన రూ.1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ అల్లుడిగా నీవు(చంద్రబాబు) వచ్చినపుడు నిన్ను ముఖ్యమంత్రిని చేసింది మేమే.. నేను హుందాగా మాట్లాడుతా అని చంద్రబాబు అంటున్నారు.. హుందాగా మాట్లాడటం గురించి మీరు మాకు నేర్పాలా చంద్రబాబు’ అని తలసాని ప్రశ్నించారు.
ప్రధానికి, మాకు లింక్ ఎందుకు పెడుతున్నారని తలసాని అడిగారు. చంద్రబాబు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని, చంద్రబాబు వద్ద మేము పనిచేశామని ఆయన గురించి మాకు బాగా తెలుసునని తలసాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు వస్తే నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హైటెక్ సిటీకి ఎక్కడ ఫౌండేషన్ వేశారో చూపిస్తానని సవాల్ విసిరారు. ఒడిశా, కలకత్తా వెళ్లి సీఎం కేసీఆర్ ఏం చేశారో ముందు ముందు మీకు తెలుస్తుందని అన్నారు. ధర్మపోరాట దీక్షల పేరుతో వందల కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు అన్నీ కూడా రాజశేఖర్ రెడ్డే మొదలు పెట్టారని, నదుల అనుసంధానం కూడా 80 శాతం రాజశేఖర్ రెడ్డియే చేశారని వ్యాఖ్యానించారు.