ఓడిపోతామని ఊహించలేదు: మాణిక్‌ సర్కార్‌

Tripura Result Was Completely Unexpected Syas Manik Sarkar - Sakshi

అగర్తలా : పాతికేళ్ల అప్రతిహత కమ్యూనిస్టు పాలనకు తెరదించిన తాజా ఎన్నికల ఫలితాలపై త్రిపుర ఆపధర్మ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ తొలిసారి నోరువిప్పారు. ‘త్రిపుర ఎన్నికల్లో ఓటమిని సమీక్షించుకుంటాం. అన్ని ప్రాంతాల నుంచి పూర్తి వివరాలను సేకరించి విశ్లేషిస్తాం. నిజానికి ఇలాంటి ఫలితం కోసం మేము సన్నద్ధంకాలేదు. మా పార్టీ(సీపీఎం) ఓడిపోతుందని అస్సలు ఊహించనేలేదు’’ అని మాణిక్‌ సర్కార్‌ అన్నారు. ఆదివారం రాత్రి ఓ జాతీయ చానెల్‌తో ఆయన మాట్లాడారు. త్రిపురకు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన దేశంలోనే పేద సీఎంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.

కొత్త సీఎం విప్లవ్‌ : శనివారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ-ఐపీఎఫ్‌టీ కూటమి ఘనవిజయం సాధించిన దరిమిలా ఆదివారంనాడు మాణిక్‌ సర్కార​ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ తథాగత రాయ్‌ సూచనమేరకు.. కొత్త కేబినెట్‌ ప్రమాణం చేసేదాకా మాణిక్‌ ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇక త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ నియమితులయ్యారు. అయితే మంగళవారం బీజేపీ–ఐపీఎఫ్‌టీ ఎమ్మెల్యేల భేటీ అనంతరం విప్లవ్‌ పేరును అధికారికంగా ప్రకటిస్తారు.

గెలుపు ఓటమిల మధ్య తేడా 0.7 శాతమే : మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ–ఐపీఎఫ్‌టీ (ఇండిజినస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర) కూటమి 43 సీట్లను గెలుచుకుంది. సీపీఎం కేవలం 16 స్థానాల్లో గెలిచింది. బీజేపీకి 43 శాతం ఓట్లురాగా, సీపీఎంకు 42.3 శాతం వచ్చాయి. గెలుపు ఓటముల మధ్య తేడా అయిన 0.7 శాతం ఓట్లను ప్రభావితం చేసిన అంశమేంటి? అనేదానిపై సీపీంఎ కసరత్తు చేస్తోంది. కొన్ని బీసీ కులాలు, ఆదివాసీ తెగల ఓట్లు గంపగుత్తగా బీజేపీకి దక్కడం వల్లే ఇలా జరిగిందనే వాదన వినిపిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top