అవి ఆత్మహత్యలు కావు.. ప్రభుత్వ హత్యలు

TPCC Preasident Utham Kumar Reddy Slams KCR In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ ఫలితాల విషయంలో గందరగోళం నెలకొనడం వల్ల పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని.. అవి ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని గవర్నర్‌ నరసింహన్‌ను కోరినట్లు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రెండు విషయాలపై గవర్నర్‌కు వివరించామని తెలిపారు. కనీస పరిపాలనా సమర్థత కేసీఆర్‌కు లేదని విమర్శించారు. విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో విఫలమయ్యారని దుయ్యబట్టారు.

ఇంటర్‌ ఫలితాల విషయంలో విద్యార్థులు విశ్వాసం కోల్పోయారని, అందుకే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వ్యాక్యానించారు. అందరికీ న్యాయం జరిగేలా మరోసారి ఫలితాలు పున: సమీక్షించాలని కోరినట్లు తెలిపారు. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలని, కారకులను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. వెంటనే భర్తరఫ్‌ చేయాలని కోరినట్లు తెలిపారు.

రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫిరాయింపులు
కేసీఆర్‌ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫిరా​యింపులు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌లో సీఎల్‌పీ విలీనం అసాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్‌తో సంబంధం లేకుండా సీఎల్పీ విలీనం సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్‌ను నిన్న గాక మొన్న పుట్టిన టీఆర్‌ఎస్‌లో విలీనమా...సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కోట్లు పెట్టి, పదవులు ఎరగా చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం: భట్టి
గవర్నర్ ను కలిసిన అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న గవర్నర్  రాజ్యాంగాన్ని కాపాడాల్సిన తక్షణ అవసరం ఏర్పడిందని అన్నారు. రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవలని భట్టి అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పెను సవాల్ విసిరారని భట్టి అన్నారు. కేసీఆర్ ఆగడాలు నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే ఫిరాయింపు చట్టాన్ని వర్తింపచేయలని భట్టి చెప్పారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కావాలనే, ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని భట్టి ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top