దళితులను దగా చేస్తున్న ప్రభుత్వాలు

TPCC Leader Chepuri Vinod Criticize On CM KCR - Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను దగా చేస్తున్నాయని టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చేపూరి వినోద్‌ విమర్శించారు. శివునిపల్లిలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. టీపీసీసీ కార్యదర్శిగా ఎన్నికైన వినోద్‌ను పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌.. తీరా రాష్ట్ర ఏర్పాటయ్యాక దళితులను దగా చేశారని విమర్శించారు.

ఎట్టకేలకు డాక్టర్‌ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసిన కేసీఆర్‌.. ఆరునెలల్లోనే బర్తరఫ్‌ చేశారని తెలిపారు. ఇంటికో ఉద్యోగమంటూ యువతను, నిరుద్యోగులను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారని, కానీ ఎక్కడా ఉద్యోగాల భర్తీ ఊసే లేదన్నారు. కేవలం వారి కుటుంబంలోనే ఐదుగురికి రాజకీయ ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ హామీ ఇంతవరకూ ఆచరణకు నోచుకోలేదని ఆరోపించారు. దళిత, గిరిజనులకు రక్షణ కవచంలా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై దళితులు, బడుగు, బలహీన వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని, రానున్న రోజుల్లో ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కత్తుల కట్టయ్య, ఘన్‌పూర్‌ పట్టణ అధ్యక్షుడు గోనెల ఎల్లయ్య, నాయకులు బైరు బాలరాజు, న్యాయం సంపత్‌రెడ్డి, గాబు శ్రీనివాస్‌రెడ్డి, కుంభం ఉపేందర్, గుర్రం సోమయ్య, ఓరుగంటి వెంకటేశ్వర్లు, గుర్రం రాజు, కొడెపాక సుధాకర్, గొడుగు రాజయ్య, కత్తుల గట్టుమల్లు, బైరు నాగరాజు, భూక్య ఆము, భూక్య శ్రీను, నక్క పాపయ్య, ఏలియా, అశోక్‌  పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top