ఎన్‌ఎస్‌యూఐ నేతలకు టికెట్లు | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌యూఐ నేతలకు టికెట్లు

Published Sun, Sep 2 2018 1:43 AM

Tickets for NSUI leaders in elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ నేతలకు ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ పార్టీకి ఓటుబ్యాంకు లాంటిదన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విద్యార్థి నేతలు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా బల్మూరి వెంకట్‌ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఉత్తమ్‌ మాట్లాడుతూ కేజీటూపీజీ ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ గాలికి వదిలేసిందన్నారు. ఫీజులివ్వమంటే డబ్బుల్లేవని చెబుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.300 కోట్లతో ప్రగతినివేదన సభ ఎలా పెడుతున్నారో విద్యార్థులు అర్థం చేసుకోవాలన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్‌ కొత్త ఉద్యోగాలు కాదు కదా కనీసం నాలుగేళ్లలో ఖాళీ అయిన ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడం ఖాయమని, తాము అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, యువజన విభాగం నాయకుడు విక్రంగౌడ్‌లతో పాటు  అన్ని జిల్లాల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు పాల్గొన్నారు.  

విద్యార్థుల ఆందోళన 
కాగా, ప్రమాణ స్వీకారం అనంతరం బల్మూరి వెంకట్‌ నేతృత్వంలో వందలాదిమంది కార్యకర్తలు గాంధీభవన్‌నుంచి ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రగతిభవన్‌ వైపు పరుగులు తీశారు. విద్యార్థులు నాంపల్లి రైల్వేస్టేషన్‌మీదుగా తెలుగు యూనివర్సిటీకి చేరుకుని కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు, కార్యకర్తల నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ వీహెచ్, బల్మూరి వెంకట్‌తో పాటు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆందోళన ముగిసింది.

Advertisement
Advertisement