చంద్రగిరిలో రిగ్గింగ్‌కు ఇవిగో సాక్ష్యాలు!

These are the evidence for rigging in Chandragiri - Sakshi

ఈసీ వద్దకు వెళ్లి షాక్‌ తిన్న సీఎం చంద్రబాబు

ఈసీని తప్పుబట్టేందుకు వెళ్లి భంగపాటు

రిగ్గింగ్‌పై వీడియో సాక్ష్యాలను చూపిన ఈసీ

బట్టబయలైన టీడీపీ నేతల బూత్‌ ఆక్రమణలు

దీంతో మారు మాట్లాడలేకపోయిన చంద్రబాబు

సీఈవోకు రూల్స్‌ తెలియవంటూ మీడియా సమావేశంలో చంద్రబాబు ఆగ్రహం

సాక్షి, న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో ఎన్నికల సంఘం రీ పోలింగ్‌కు ఆదేశించడాన్ని తప్పుబట్టేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబుకు ఊహించని పరిణామం ఎదురైంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. చంద్రగిరిలో రిగ్గింగ్‌ జరిగిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం వీడియో సాక్ష్యాలను చూపడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఐదు కేంద్రాల్లో టీడీపీ నేతలు పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించుకుని ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన తీరును వీడియో ఫుటేజీ ద్వారా చంద్రబాబుకు చూపించినట్లు తెలిసింది. మొత్తం 7 కేంద్రాలకు సంబంధించి ఫిర్యాదులు అందగా రెండు కేంద్రాల్లో కెమెరాలు పని చేయకపోవడంతో బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద వాటిని వదిలేశామని కేంద్ర ఎన్నికల కమిషనర్లు చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రిగ్గింగ్‌పై చంద్రబాబు మారు మాట్లాడకుండా తాము ఇప్పటివరకు ఇచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్య తీసుకోలేదని విన్నవించారు. అయితే రిగ్గింగ్‌కు సంబంధించి ఆధారాలుంటే సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో చంద్రబాబు మౌనం వహించారు. చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు అశోక్‌ లావాసా, çసుశీల్‌చంద్రలను కలసినప్పుడు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

బట్టబయలైన బూత్‌ల ఆక్రమణ
ఎన్నికల సంఘం వద్ద ఉన్న వీడియోల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేసిన తీరు నిక్షిప్తమైంది. ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ నేతలు బూత్‌ల ఆక్రమణలకు పాల్పడగా ఇందుకు ఎన్నికల సిబ్బంది సహకరించారు. ఓటర్లు క్యూలో నిలబడడం, సిబ్బంది దగ్గరకు వెళ్లడం, తమ పేరు చెప్పడం, ఆ తరువాత చివరగా ఓటేసినట్టుగా సిరా గుర్తు పెట్టడం, బయటకు పంపుతున్న దృశ్యాలు ఈ వీడియోల్లో నిక్షిప్తమయ్యాయి. ఓట్లేయాల్సిన ఈవీఎంల వద్ద ముగ్గురు చొప్పున టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేసినట్లు సమాచారం.

మా ఫిర్యాదులను పట్టించుకోవట్లేదు
ఈసీతో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘మళ్లీ మళ్లీ ఎన్నికల సంఘం వద్దకు రావాల్సి వస్తోంది. చాలా బాధ పడుతున్నా. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈసీని ప్రశ్నిస్తున్నాయంటే బాధ్యతగా వ్యవహరించడం లేదనే లెక్క. మొన్ననే ప్రధాని ఎంపైర్‌(ఎన్నికల సంఘం) పై కావాలని విమర్శలు చేస్తున్నారని నన్ను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించారు. ఈసీ చేసిన తప్పులను ప్రశ్నించటానికే వచ్చాం. 25 రోజుల తరువాత చంద్రగిరిలోని ఐదు బూత్‌ల్లో రీ పోలింగ్‌కు ఆదేశించారు. పశ్చిమ బెంగాల్‌లో హోం కార్యదర్శి సీఈవోకు ఒక లేఖ రాశారని ఆయన్ను బదిలీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారనే కారణంతో బదిలీ చేశారు. మరి ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖకు స్పందిస్తూ 5 బూత్‌ల్లో రీ పోలింగ్‌కు ఆదేశించారు. ఇది పక్షపాత ధోరణి. ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారని మేం అడిగాం. మా ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తే ఇప్పుడు తీసుకుంటామని చెబుతున్నారు. మేం ప్రశ్నించాం కాబట్టి మొక్కుబడిగా ఒకటి రెండు చోట్ల రీ పోలింగ్‌ జరిపి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ఇది మంచిది కాదు. 9 లక్షల ఓట్లను ఫామ్‌ 7 ద్వారా తొలగించాలని చూస్తే రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. ఐపీ అడ్రస్‌లు అడిగితే ఇవ్వడం లేదు. ప్రజ్ఞాసింగ్‌పై చర్యలు తీసుకోవాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

నువ్వు రాజకీయ పార్టీ కార్యకర్తవి కాదు..
హోం సెక్రటరీ లేఖ రాస్తే బదిలీ చేశారు. మన దగ్గర సీఎస్‌ రాస్తే చర్య లేదు. సీఎస్‌కు, ఈ విధులకు సంబంధం లేదు. ఎన్నికల్లో ఎలా జోక్యం చేసుకుంటారు. నువ్వు  రాజకీయ పార్టీ కార్యకర్తవి కాదు. ఎన్నికల విధుల్లో లేవు. ఎన్నికల విధుల్లో కలెక్టర్‌ ఉన్నాడు. ఆయన చేయొచ్చు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌ చేయొచ్చు. సీఎస్‌కు సంబంధం ఏమిటి?’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. 

ఈజ్‌ ఇట్‌ నాట్‌ వివక్షత?
చంద్రగిరిలో రిగ్గింగ్‌కు సంబంధించి వీడియో సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే రీపోలింగ్‌కు ఆదేశించామని, ఇతర చోట్ల అలాంటివి ఏమైనా ఉంటే టీడీపీ చూపించాలంటూ  సీఈవో చెబుతున్నారని మీడియా పేర్కొనగా.. ‘ఇప్పుడు మేం అడిగితే రెండు చోట్ల రీ పోలింగ్‌కు సూచిస్తున్నట్లు చెప్పారు. ఇదేనా నిష్పాక్షికత?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘పశ్చిమ బెంగాల్‌లో కార్యదర్శిని బదిలీ చేశారు. మన సీఎస్‌ను ఎందుకు బదిలీ చేయరు? ఈజ్‌ ఇట్‌ నాట్‌ వివక్షత?’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రగిరిలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అన్న రీతిలో ఎన్నికలు జరిగాయని సీఈవో వ్యాఖ్యానించారని ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా.. ‘ఎక్కడా? ఏపీలోనా? పులివెందుల, వీటన్నింటిలో ఏం జరిగింది? వాళ్ల చిన్నాన్నను చంపేస్తే దిక్కు తెలియలా? ఏం మాట్లాడుతున్నారండీ ఈయన. వాళ్ల చిన్నాన్నను ఇంట్లో చంపేస్తే, సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేస్తే అక్కడ బ్రహ్మాండంగా ఎన్నికలు జరిగాయా? ఏం మాట్లాడతారండీ..? ఎన్నికల సంఘం హద్దులు పెట్టుకుని మాట్లాడాలి. ఒక ప్రాంతంపై వివక్షతో మాట్లాడడం సరికాదు’ అని పేర్కొన్నారు.

బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలసి పనిచేస్తాం..
ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు 21 పార్టీల సమావేశం గురించి మీడియా ప్రశ్నించగా ‘అందరూ ఎన్నికల బిజీలో ఉన్నారు. వర్కవుట్‌ చేస్తున్నాం..’ అని చంద్రబాబు చెప్పారు. టీఆర్‌ఎస్‌ లాంటి పార్టీలను పిలిస్తే మీకు అభ్యంతరం లేదా? అని ప్రశ్నించగా.. ‘బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు కలిసొచ్చినా కలిసి పనిచేస్తాం..’ అని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ గురించి మరోసారి మీడియా ప్రశ్నించగా ‘ఊహాతీతమైన ప్రశ్నలు వద్దు. బీజేపీకి వ్యతిరేకంగా, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఎవరెవరు వస్తారో వారందరికీ స్వాగతం.. ఒక పార్టీని వివక్ష చూపక్కర్లేదు. పార్టీల పేర్లు అవసరం లేదు..’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top