ఒత్తిళ్లను ఖాతరు చేయొద్దు: సీఎం జగన్‌

There Should Be Transparency In Every Step, Says CM YS Jagan - Sakshi

 అవినీతిరహిత పాలనను అందించేందుకు సహకరించండి

సాక్షి, అమరావతి: అవినీతిపై పోరాటంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ  తనపై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని, అయితే వాటికి లొంగే ప్రసక్తే లేదని తెలిపారు. టెండర్ల ప్రక్రియ మొదలు, తీసుకువచ్చిన అప్పుల వరకూ పైస్థాయిలో ఏది చూసినా వందలు, వేలకోట్ల రూపాయాల్లో కుంభకోణాలు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలా? లేక అవినీతి చేసినవారిని వదిలేయాలా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం విషయాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి ఉందని, అవినీతి లేకుండా అదే ఇళ్లు, తక్కువ ఖర్చుకు లభించేవి కదా? అని అన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని, దీనివల్ల మిగిలే ప్రతి పైసా ప్రజలకే చెందుతుందని అన్నారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతిరహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి గట్టిగా సహకరించాలని, ఒత్తిళ్లను ఖాతరు చేయొద్దని సూచించారు.

మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి పంచాయతీరాజ్‌ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్‌ కల్లాం, సలహాదారులు శామ్యూల్‌, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కాగా గత ప్రభుత్వ పాలసీలను సమీక్షించేందుకు ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 30 అంశాల్లో అవినీతిని వెలికితీసే బాధ్యతను ఈ సబ్‌ కమిటీ చేపట్టింది.  ఐదేళ్లుగా గత ప్రభుత్వం సాగించిన అవినీతి బాగోతాలపై విచారణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి ఈ మంత్రివర్గ ఉప సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు ప్రత్యేక ఆహ్వానితులుగా, సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ ఈ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top