స్థానిక పోరులో.. జాడలేని ‘దేశం’!

telugu desam party not participated in ZPTC And MPTC Elections - Sakshi

తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తేసినట్టే కనిపిస్తోంది. స్థానిక సంస్థల పోరులో ఆ పార్టీ ఉనికి ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీ తరఫున జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసేందుకు ముందుకు వస్తున్న నాయకులు నామ మాత్రంగా కూడా లేరు. బుధవారం ముగిసిన తొలి విడత నామినేషన్లలో కూడా ఆ పార్టీ నుంచి స్వల్పంగానే దాఖలయ్యాయి. ఇక, జెడ్పీ చైర్మన్‌ పీఠం గురించి ఆలోచించే స్థితిలో పార్టీ నాయకత్వం కనిపించడం లేదు. 

సాక్షిప్రతినిధి, నల్లగొండ : తెలుగు దేశం పార్టీ జిల్లాలో నామమాత్ర ఉనికి కూడా చాటడం లేదు. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటినుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క స్థానం నుంచి కూడా టీడీపీ అభ్యర్థులు పోటీ చేయలేక పోయారు. ఆ తర్వాత జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లోనూ ఆ పార్టీ కింది స్థాయి నాయకులకు అండగా నిలిచిన వారు లేరు. దీంతో పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ ఉనికి కనిపించలేదు. ఈనెలలోనే జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ అభ్యర్థులను పెట్టలేదు. ఇపుడు పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థల ఎన్నికల వంతు వచ్చింది. ఈఎన్నికల్లోనూ టీడీపీ  అడ్రస్‌ కనిపించడం లేదు. మొత్తానికి మొత్తంగా ఎన్నికల పోరుకు తెలుగుదేశం పూర్తిగా నీళ్లొదిలినట్టే కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
 
పార్లమెంట్‌ ఎన్నికల ముందు జిల్లా అధ్యక్షుడు జంప్‌
జిల్లాలో తెలుగుదేశం ఇక కోలుకునేలా వాతావరణం కానీ, అనుకూల పరిస్థితులు కానీ కనిపించడం లేదు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులంతా టీడీపీని వీడారు. కొత్త నాయకత్వం తయారవుతుందన్న విశ్వాసం కూడా కలగడం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సరిగ్గా పార్లమెంట్‌ ఎన్నికల ముందు టీడీపీ జిల్లా అధ్యక్షుడు యూసుఫ్‌ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే సమయంలో స్థానిక ఎన్నికలు రావడంతో ఆ పార్టీని నడిపించే జిల్లా నాయకత్వం లేకుండా పోయింది. ఈ కారణంగానే కార్యకర్తల్లో మనోధైర్యం నింపి ముందుకు నడిపించే వారే లేకుండా పోవడంతో పార్టీని నమ్ముకుని పోటీ చేసే ధైర్యం చేయలేక ‘తమ్ముళ్లు’ ముందుకు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

గతంలో రెండు సార్లు జెడ్పీ పీఠంపై టీడీపీ
జిల్లాలో టీడీపీది ఇక గత చరిత్రే. ప్రస్తుతం ఆ పార్టీ జిల్లాలో బోర్డు తిప్పేసినట్టేనన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జిలాపరిషత్‌ చైర్మన్‌ పీఠాన్ని ఆ పార్టీకి చెందిన నాయకులు రెండు పర్యాయాలు అధిష్టించారు. టీడీపీ నుంచి బొందుగుల నర్సింహారెడ్డి, సీడీ రవికుమార్‌లు జెడ్పీ చైర్మన్లుగా పనిచేశారు. జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యేలను గెలుచుకున్న చరిత్రా టీడీపీకి ఉంది. టీడీపీ నుంచి ఇక్కడి నుంచే ఎంపీలుగా గెలిచిన వారూ ఉన్నారు.

ఇప్పుడా చరిత్రంతా గతమేనని పేర్కొంటున్నారు. 2014 ఎన్నికల్లో పలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఉనికి చాటుకున్న టీడీపీ.. ఆ తర్వాత ఒక్కొక్క నాయకుడిని కోల్పోయింది. జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన బిల్యానాయక్, రమేష్‌ రెడ్డి, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ఇలా.. వరుసబెట్టి నాయకులంతా పార్టీని వీడారు. ఉన్న కొద్దిమంది నేతలతో బండిని నడిపించాలని చూసినా.. మొన్నటి ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా టీడీపీ నుంచి వలసలు ఆగలేదు. ఇప్పుడా ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపిస్తోంది. ఇక, ఆ పార్టీ జిల్లాలో చాప చుట్టేసినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top