సల్లపూట..ఓటుబాట

Telangana ZPTC And MPTC  Elections Peaceful  In Adilabad - Sakshi

ప్రాదేశిక ఎన్నికల్లో ఓటర్లు క్యూ కట్టారు. ఎండను సైతం లెక్కచేయకుండా పోలింగ్‌ కేంద్రాల బాట పట్టారు. శుక్రవారం బోథ్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జరిగిన మలి విడత ఎన్నికల్లో అంతా ఉత్సాహంగా ఓటేయడంతో 75.33 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇందులో మహిళలు అధిక సంఖ్యలో ఓటేయడం గమన్హారం. 

ఇచ్చోడ(బోథ్‌): జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాతంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఉదయం, సాయంత్రం పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఎండకు పోలింగ్‌ మందకొడిగా కొనసాగింది. పగటి పూట పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు లేకపోవడంతో సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. సాయంత్రం ఒకేసారి బారులు తీరారు. దూర ప్రాంతాలు, పట్టణ ప్రాంతంలో ఉన్న వారు, పొలం పనులకు వెళ్లిన వారు సాయంత్రం ఐదు గంటలలోపు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని ఓటేశారు. దీంతో సాయంత్రం వేళా పోలింగ్‌శాతం అధికంగా నమోదైంది. ఉదయం 9 గంటల వరకు పోలింగ్‌ జరుగుతున్న ఐదు మండలాల్లో కేవలం 18.45శాతం మాత్రమే పోలింగ్‌ నమోదు కాగా చివరకు పెరిగింది.

75.33శాతం పోలింగ్‌ నమోదు
ఐదు మండలాల్లో మొత్తం 1,26,960 మంది ఓటర్లు ఉండగా 94,130 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 46,987 మంది పురుషులు, 47,147 మంది మహిళలు ఓటేశారు. తలమడుగు మండలంలో అత్యధికంగా 81.05 శాతం పోలింగ్‌ నమోదు కాగా, అతిస్వల్పపంగా బజార్‌హత్నూర్‌ మండలంలో 72.65 పోలింగ్‌ శాతం నమోదైంది.

చిన్నచిన్న సంఘటనలు
బోథ్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో చిన్నచిన్న సంఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. నేరడిగొండ మండలం కొర్టిటికల్‌(బి)లో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని సద్దుమణిగించారు. నారాయణపూర్‌లో పోలింగ్‌ కేంద్రంలో ఉన్న పార్టీ ఏజెంట్ల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. బోథ్‌ మండలంలోని సోనాలలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు ప్రచారం జరగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గుడిహత్నూర్‌ పోలింగ్‌ స్టేషన్‌ను ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ పరిశీలించారు.

టివిటిలో పోలింగ్‌ బహిష్కరణ
బోథ్‌ మండలంలోని టివిటి గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గతంలో తమ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయకుండా ఇతర గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేశారని, ప్రసుతం తమ గ్రామంలో పోలింగ్‌ భూత్‌ ఏర్పాటు చేయకుండా పార్టీబి గ్రామంలో పోలింగ్‌ భూత్‌ ఏర్పాటు చేశారని వారు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పార్టీ బి గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో వెళ్లి ఓటు వేయడానికి వెళ్లాల్సి ఉంటుందని గ్రామస్తులు ఓట్లు వేయకుండా ఎన్నికలు బహిష్కరించారు. ఈ గ్రామంలో 167 మంది ఓటర్లు ఉన్నారు.

పోలింగ్‌కు భారీ బందోబస్తు
రెండో విడతలో తలమడుగు, గుడిహత్నూర్, బజార్‌హత్నూర్, నేరడిగొండ, బోథ్‌ మండలాల్లో జరిగిన ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. పోలింగ్‌ కేంద్రానికి ఇరువైపులా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రాలకు వందమీటర్ల దూరంలో ఎవరినీ రానివ్వలేదు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top