‘సహకార’కు నోటిఫికేషన్‌ | Telangana PACS Election Polling Date Is 15/02/2020 | Sakshi
Sakshi News home page

‘సహకార’కు నోటిఫికేషన్‌

Feb 4 2020 2:42 AM | Updated on Feb 4 2020 2:42 AM

Telangana PACS Election Polling Date Is 15/02/2020 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 905 ప్యాక్స్‌ల్లోని 11,765 డైరెక్టర్‌ పదవులకు జిల్లాల్లో సహకార ఎన్నికల అథారిటీ సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, ఆర్‌డీవోలు, జిల్లాల సహకార అధికారులతో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయిన జనార్దన్‌ రెడ్డి, రాష్ట్ర సహకార కమిషనర్‌ వీరబ్రహ్మయ్య, రాష్ట్ర ఎన్నికల సహకార అథారిటీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించారు. మొత్తం 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్‌ల)కుగాను మహబూబాద్‌ జిల్లాలోని ఒక ప్యాక్స్‌కు ఎన్నిక నిర్వహించడం లేదు.

ఆ ప్యాక్స్‌లో నిధులు లేకపోవడమే ఇందుకు కారణంగా అధికారులు తెలిపారు. ప్రతీ ప్యాక్స్‌ వారి నిధులతోనే ఎన్నికలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రతీ ప్యాక్స్‌కు 13 మంది డైరెక్టర్ల చొప్పున మొత్తం 11,765 డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఇటు ప్రతి ప్యాక్స్‌కు ఎన్నికల నోటీసులు కూడా జారీ చేశారు. ఇక సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500, బీసీలు రూ.750, ఓసీ (ఇతరులు) రూ.వెయ్యి నామినేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఓటర్లను 13 డైరెక్టర్‌ వార్డులుగా విభజిస్తారు. ఈ 13 వార్డుల్లో రెండు డైరెక్టర్‌ పదవులు మహిళలు, మరో రెండు డైరెక్టర్‌ పదవులు బీసీలకు, ఒక డైరెక్టర్‌ పదవి ఎస్సీ, ఎస్టీల్లో ఒకరికి రిజర్వు చేశారు.

సమాన ఓట్లు వస్తే లాటరీ.. 
ఒక్కోఅభ్యర్థి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలకు మించి దాఖలు చేయరాదు. ఒక డైరెక్టర్‌ వార్డులో ఓటరుగా నమోదైన వ్యక్తి మరో డైరెక్టర్‌ వార్డులో పోటీ చేయొచ్చు. సదరు అభ్యర్థిని బలపరిచి, ప్రతిపాదించే వ్యక్తులు మాత్రం ఆయా వార్డుల్లోనే ఓటు హక్కు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఒకరిని మాత్రమే ప్రతిపాదించాల్సి ఉంటుంది. బలపరిచే, ప్రతిపాదించే వ్యక్తులు ఓటు వేసేందుకు అర్హులై ఉండాలి. నామినేషన్‌ పత్రాన్ని ఎన్నికల అధికారికి ఇచ్చే సమయంలో తప్పనిసరిగా ప్రతిపాదిస్తున్న వ్యక్తి పోటీ చేసే వ్యక్తితో ఉండాల్సి ఉంటుంది. ఇక పోటీ చేసే అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వస్తే విజేతను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు.

ఒక్కో డైరెక్టర్‌ ఒక పోలింగ్‌ బూత్‌ 
ఒక్కో డైరెక్టర్‌ ఎన్నికకు ఒక్కో పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో 11,765 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ముగ్గురు ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు దాదాపు 30 వేల మంది సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తి చేసినట్లు సహకార శాఖ వర్గాలు వెల్లడించాయి. నోటిఫికేషన్‌ ప్రకారం నామినేషన్లు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు స్వీకరించనున్నారు. తొమ్మిదో తేదీన నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, గుర్తు కేటాయింపులు చేస్తా రు. ఈ నెల 15వ తేదీన ఉదయం 7 గంట ల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించి, వెంటనే ఓట్ల లెక్కిం పు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement