మాస్టర్‌ ప్లాన్‌ నివేదించండి 

Telangana High Court Review  On Erramanzil Issue - Sakshi

ఎర్రమంజిల్‌ భవన కేసులో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: ఎర్రమంజిల్‌ భవన కూల్చివేతను అడ్డుకోవాలని కోరుతున్న కేసులో హెచ్‌ఎం డీఏ మాస్టర్‌ ప్లాన్‌ను హైకోర్టుకు నివేదించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ల ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎర్రమంజిల్‌ భవన ప్రదేశంలో చట్టసభల సముదాయాన్ని నిర్మించాలనే ప్రయత్నాల్ని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను శుక్రవారం హైకోర్టు  విచారణ చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతిరెడ్డి స్వయంగా విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా హుడా చట్టంలోని 13వ నిబంధనను రద్దు చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఆ నిబంధనను హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో పొందుపర్చారని ధర్మాసనానికి న్యాయవాది నివేదించారు. కొత్త అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణానికి 20 నుంచి 25 ఎకరాల భూమి అవసరమని «గణపతిరెడ్డి ధర్మాసనానికి తెలిపారు. కొత్త అసెంబ్లీ భవనాల కోసం ప్రణాళిక ఇంకా సిద్ధం కాలేదన్నారు.

ప్రణాళిక బాధ్యతలను ప్రభుత్వం మూడు కన్సల్టెన్సీ సంస్థలకు ఇచ్చిందని, ఆ సంస్థల నుంచి మూడు ప్రణాళికలు వచ్చాక అందులో ఒక దానిని ప్రభుత్వం ఆమోదిస్తుందన్నారు. దీంతో ధర్మా సనం జోక్యం చేసుకుని గదులు, సమావేశ మందిరాలు ఎన్నెన్ని ఉంటాయి వంటి వివరాలు ఇవ్వాల ని కోరింది. ఇవి కన్సల్టెన్సీల నుంచి ప్రణాళికలు వచ్చాకే అవి తెలుస్తాయని గణపతిరెడ్డి సమాధానమిచ్చారు. ఇప్పుడున్న అసెంబ్లీ, కౌన్సిల్‌ వేర్వేరుగా ఉన్నాయని, ఇవి సుమారు 25 ఎకరాల్లో ఉన్నాయని, ఇప్పుడు కూడా అదే భూమి అవసరం అవు తుందని తెలిపారు. ప్రభుత్వం నిబంధన 13 ను రద్దు చేసిందని, ఈ పరిస్థితుల్లో ఆ నిబంధన ప్రారంభమైనప్పటి నుంచి అమల్లో లేనట్లేనని చెబుతోందని, దీనిపై ఏం చెబుతారని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top