ఇంకెంత లేటు? | Telangana Elections 2018 Uttam Kumar Meeting With Kodandaram | Sakshi
Sakshi News home page

ఇంకెంత లేటు?

Nov 17 2018 1:25 AM | Updated on Sep 19 2019 8:44 PM

Telangana Elections 2018 Uttam Kumar Meeting With Kodandaram - Sakshi

నాంపల్లిలోని టీజేఎస్‌ కార్యాలయంలో కోదండరామ్‌తో చర్చిస్తున్న ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: సీట్ల సర్దుబాటు విషయం లో కాంగ్రెస్‌ అవలంభిస్తున్న నాన్చుడి ధోరణిపై తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ పక్క ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంటే.. కూటమి పార్టీలు పొత్తులంటూ జాప్యం చేయడంపై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వద్ద తన అసహనాన్ని వెళ్లగక్కారు. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్‌ తీరు ఏమాత్రం హర్షణీయంగా లేదని, కాంగ్రెస్‌ చేస్తున్న జాప్యం మొత్తం కూటమి లక్ష్యానికే విఘాతం కల్గిస్తుందని హెచ్చరించారు. శుక్రవారం నాటికి కొలిక్కి వస్తుందనుకున్న సీట్ల సర్దుబాటు అంశం ఎటూ తేలలేదు. ముఖ్యంగా టీజేఎస్‌కు కాంగ్రెస్‌ ఎన్ని టికెట్లు కేటాయిస్తుంది.. ఏయే స్థానాలకు ఒకే చెప్పనుందన్న దానిపై ప్రతిష్టంభన వీడలేదు. జనగామ, మిర్యాలగూడతోపాటు వరంగల్‌ తూర్పు నియోజకవర్గంపై శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇద్దరి మధ్య చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు. 

అర్ధరాత్రి చర్చలు... 
తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని టీజేఎస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.  అయితే, టీజేఎస్‌కు 8 స్థానాలే కేటాయిస్తామని చెబుతూ వస్తున్న కాంగ్రెస్‌.. వీటిలో ఆరింటికి ఓకే చెప్పింది. జనగామ, మిర్యాలగూడపై స్పష్టత ఇవ్వలేదు. వీటితోపాటే స్టేషన్‌ ఘన్‌పూర్, ఆసిఫాబాద్‌ స్థానాల నుంచి కాంగ్రెస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. అక్కడ పోటీ చేసేందుకు టీజేఎస్‌ కూడా సై అంటోంది. ఈ నేపథ్యంలో  రాత్రి 11 గంటలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీజేఎస్‌ కార్యాలయానికి వచ్చి కోదండరాంతో  చర్చించారు. దుబ్బాక, మెదక్, మల్కాజ్‌గిరి, అంబర్‌పేట, సిధ్దిపేట, వర్ధన్నపేట స్థానాలు ఇచ్చేందుకు ఉత్తమ్‌ సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలిసింది.  జనగామ విషయంలో పొన్నాల లక్ష్మయ్య పట్టుదలతో ఉన్నందున, ఆ సీటు వదిలేయాలని కోరినట్టు సమాచారం. దీనిపై శనివారం జరిగే కోర్‌ కమిటీ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కోదండరామ్‌ బదులిచ్చినట్టు తెలిసింది. మిర్యాలగూడలో టీజేఎస్‌ తరఫున విద్యాధర్‌రెడ్డిని పోటీలో నిలుపుతామని చెప్పగా..

ఇదే స్థానంలో జానారెడ్డి తన బంధువు విజయ్‌కుమార్‌రెడ్డిని నిలపాలని పట్టుబడుతున్న విషయాన్ని ఉత్తమ్‌ వివరించారు. విజయ్‌కు జానారెడ్డి మద్దతు ఉన్నందున ఆయనకే విజయావకాశాలు ఉంటాయన్నారు. అయినప్పటికీ, తమకు ఆ స్థానం ముఖ్యమని కోదండరామ్‌ స్పష్టం చేసినట్లుగా తెలిసింది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన ఆసిఫాబాద్, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో టీజేఎస్‌ పోటీ పెట్టకూడదని ఉత్తమ్‌ కోరినట్లుగా సమాచారం. అయితే అక్కడ స్నేహపూర్వక పోటీ తప్పకపోవచ్చన్న ధోరణిని కోదండరామ్‌ వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చర్చల వివరాలను మీడియాకు వెల్లడించేందుకు ఉత్తమ్‌ నిరాకరించారు. ఢిల్లీ నుంచి అర్ధరాత్రి 12.30కి వచ్చిన కుంతియాను తీసుకుని మళ్లీ వస్తానని చెప్పి  వెళ్లిపోయారు. శనివారం ఉదయం 10 గంటలకు టీజేఎస్‌ కోర్‌ కమిటీ సమావేశం తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ]

మూడు తీర్మానాలకు ఓకే.. 
టీజేఎస్‌ కోర్‌ కమిటీ తీసుకున్న మూడు తీర్మానాలను ఉత్తమ్‌కు తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే కామన్‌ మినిమం ప్రోగ్రాం అమలు కమిటీకి చట్టబద్ధత కల్పించాలని, ఆ కమిటీకి కోదండరామ్‌ను చైర్మన్‌ చేయాలని తీర్మానించిన విషయాన్ని వివరించారు. అలాగే కోదండరామ్‌ను కేబినెట్‌లోకి తీసుకొని కామన్‌ మినిమం ప్రోగ్రాం అమలు బాధ్యతను ఆయన పరిధిలోనే ఉంచాలని తీర్మానించిన విషయాన్ని తెలియజేశారు. ఈ మూడు తీర్మానాలు తమకు సమ్మతమేనని ఉత్తమ్‌ స్పష్టంచేసినట్లుగా తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement