పయ్యావులతో కేసీఆర్‌ భేటీ

Telangana CM KCR Meets Payyavula Keshav - Sakshi

15 నిమిషాల పాటు ఏకాంత చర్చలు

అనంతపురం: మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌ వివాహ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ భేటీ అయ్యారు. ఏకాంతంగా 15 నిమిషాల సేపు వారిద్దరూ మాట్లాడుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆదివారం వివాహ వేడుకలో దాదాపు 30 నిమిషాల పాటు గడిపిన కేసీఆర్‌.. ఆపై 15 నిమిషాలు కేశవ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడారు.

అనంతరం కల్యాణ మండపం నుంచి హెలిప్యాడ్‌కు తిరిగి వెళ్తుండగా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ ఎదురు పడ్డారు. కేసీఆర్‌కు కేశవ్‌ నమస్కారం చేయగా.. కేసీఆర్‌ ప్రతి నమస్కారం చేసి ముందుకు సాగారు. ఆ వెంటనే కేసీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శి కేశవ్‌ వద్దకు వచ్చి సీఎం గారు పిలుస్తున్నారని చెప్పారు. దీంతో కేశవ్‌.. కేసీఆర్‌ ఉన్న చోటుకు వెళ్లారు. దాదాపు 15 నిమిషాల పాటు ఇద్దరూ ప్రత్యేకంగా మాట్లాడారు. సీఎం వ్యక్తిగత సిబ్బంది వారి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా కేసీఆర్‌ వారించినట్లు తెలుస్తోంది. అనంతపురం ఇన్‌చార్జి మంత్రిగా కేసీఆర్‌ మూడేళ్లపాటు గతంలో కొనసాగారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పయ్యావుల కేశవ్‌ ఉండేవారు. ఈ సాన్నిహిత్యంతో ఇద్దరూ ఏకాంతంగా చర్చలు సాగించినట్లు తెలుస్తోంది.

2019 ఎన్నికల నేపథ్యంలో తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాలపై ఇద్దరూ ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. చివరగా ‘హైదరాబాద్‌లో కలుద్దాం’ అని కేసీఆర్‌ వెళ్లిపోయినట్లు తెలిసింది. వివాహ వేడుకకు హాజరైన పలువురు  మంత్రులు, మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్‌ నేతలతో కేసీఆర్‌కు మంచి పరిచయాలు ఉన్నాయి. అయితే వారెవ్వరితో కాకుండా పయ్యావులతో మాత్రమే ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. వారేం మాట్లాడారో అని టీడీపీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top