
అప్పులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభకు సమర్పించిన నోట్
అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకున్న టీడీపీ కూటమి సర్కారు
రూ.10 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు
అప్పులంటూ ఇన్నాళ్లుగా గత ప్రభుత్వంపై పదేపదే చేసిన దుష్ప్రచారంలో నిజం లేదని అంగీకారం
2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాక ముందు.. టీడీపీ దిగిపోయే నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు రూ.3,06,952.26 కోట్లు
జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి బడ్జెట్‌తో పాటు గ్యారెంటీ కలిపి రాష్ట్రం మొత్తం అప్పులు రూ.6.77 లక్షల కోట్లే
ఆర్థిక మంత్రి.. అసెంబ్లీ సాక్షిగా..
అప్పులపై చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా అసెంబ్లీ సాక్షిగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ నిజాలను చెప్పాల్సి వచ్చింది. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి బడ్జెట్‌తోపాటు గ్యారెంటీ కలిపి మొత్తం అప్పు రూ.3,06,952.26 కోట్లుగా ఉందని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3,70,897 కోట్లేనని అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై చట్టసభ సాక్షిగా చంద్రబాబు సర్కారు అబద్ధాలు మరోసారి బట్టబయలయ్యాయి! వైఎస్సార్‌సీపీ హయాంలో చేసిన అప్పులు రూ.14 లక్షల కోట్లు... రూ.10 లక్షల కోట్లు... అంటూ నోటికొచ్చినట్లు పదేపదే నిస్సిగ్గుగా చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని శాసనసభ సాక్షిగా స్వయంగా ఒప్పుకుంది! వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన మొత్తం అప్పులు రూ.3,70,897 కోట్లు మాత్రమేనని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ వేదికగా సోమవారం లిఖితపూర్వకంగా వెల్లడించారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాక ముందు.. నాడు టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు రూ.3,06,952.26 కోట్లు అని కూటమి ప్రభుత్వం సభ సాక్షిగా ప్రకటించడం గమనార్హం.
ఆగస్టు నాటికే రూ.44,364.06 కోట్లు అప్పు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో రూ.1,03,656.50 కోట్లు బడ్జెట్ అప్పులు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇందులో ఆగస్టు నెలాఖరు నాటికి రూ.44,364.06 కోట్లు అప్పు చేసినట్లు వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు మంత్రి కేశవ్ సోమవారం అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
వైఎస్సార్‌సీపీ దిగిపోయే నాటికి మొత్తం అప్పులు రూ.6,77,849.80 కోట్లు..
ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2024 జూన్ 12 నాటికి బడ్జెట్ అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు కలిపి మొత్తం రూ.6,77,849.80 కోట్లు మాత్రమే అప్పులు ఉన్నట్లు మంత్రి కేశవ్ తన సమాధానంలో వెల్లడించారు.
ఇందులో 2014–15 నుంచి 2018–19 వరకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న బడ్జెట్ అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు కలిపి రూ.3,06,952.26 కోట్లు ఉన్నాయన్నారు. ఆ తరువాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బడ్జెట్‌తో పాటు గ్యారెంటీతో కలిపి రూ.3,70,897.54 కోట్లు మాత్రమే అప్పులు చేసిందని ఆర్థిక మంత్రి కేశవ్ లిఖిత పూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. ఈ గణాంకాలన్నీ అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఫైనాన్స్ ఖాతాల నుంచి చెప్పినట్లు మంత్రి కేశవ్ పేర్కొన్నారు.
2024లో ఆర్థిక శాఖపై సమీక్ష సందర్భంగా రాష్ట్ర అప్పులు రూ.14లక్షల కోట్లు అని ప్రకటించిన సీఎం చంద్రబాబు
సీఎంగా ఉంటూ అబద్ధాలా బాబూ..?
బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ పదే పదే సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనని శాసనసభ సాక్షిగా ఆర్థిక మంత్రి లిఖిత పూర్వక సమాధానంతో మరోసారి తేటతెల్లమైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2024 జూన్ 12 నాటికి ఐదేళ్లలో బడ్జెట్‌లోనూ, బడ్జెట్ బయట గ్యారెంటీలతో చేసిన మొత్తం అప్పు కేవలం రూ.3,70897.54 కోట్లేనని ఆర్థిక మంత్రి కేశవ్ సమాధానంతో వెల్లడైంది.
2024లో తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు అని పేర్కొన్న భాగం
వాస్తవాలు ఇలా ఉంటే ఇప్పటికీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలోనూ, బయట పదేపదే గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిదంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతుండటం, సాక్షాత్తూ గవర్నర్‌తోనూ ఆయన ప్రసంగంలో అబద్ధాలు పలికిస్తుండటం విస్తుగొలుపుతోంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ అవాస్తవాలు చెప్పడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ చేయని అప్పులు చేసినట్లు బుకాయించడం ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.