
సాక్షి, తాడేపల్లి : టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెందే పార్టీకి రాజీనామా చేశానని ఎమ్మెల్సీ శమంతకమణి అన్నారు. బుధవారం ఆమె.. కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినిబాలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శమంతకమణి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో ప్రస్తుతం అనుభవం లేని ఆధిపత్య పోరు ఎక్కువైందని, ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నానికి విసిగి వేసారి వైఎస్సార్‌సీపీలో చేరామని చెప్పారు.
(చదవండి : ‘అనంత’లో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ)
తనలాంటి సీనియర్లు చాలా మంది సందిగ్థంలో ఉన్నారన్నారు. సీఎం జగన్ జనరంజక పాలనలో పాలు పంచుకోవడానికే వైఎస్సార్‌సీపీలో చేరామని తెలిపారు. శింగనమల ప్రస్తుత ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో కలిసి నిజయోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సీఎం జగన్ తీసుకువచ్చిన ‘దిశ’, ‘అమ్మ ఒడి’ లాంటి పథకాలకు ఆకర్షితులమయ్యే తాము వైఎస్సార్‌సీపీలో చేరామని మాజీ ఎమ్మెల్యే యామినిబాల అన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరడం.. తిరిగి సొంతింటికి వచ్చినట్లు ఉందని తెలిపారు.