అడ్డంగా దొరికి అడ్డగోలు దాడి! | TDP Leaders claims that they have nothing to do with IT attacks | Sakshi
Sakshi News home page

అడ్డంగా దొరికి అడ్డగోలు దాడి!

Feb 15 2020 4:16 AM | Updated on Feb 15 2020 4:16 AM

TDP Leaders claims that they have nothing to do with IT attacks - Sakshi

సాక్షి, అమరావతి: ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో రూ.వేల కోట్ల అవినీతి వ్యవహారాలు బట్టబయలైనా కప్పిపుచ్చి పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన పరివారం ఎదురుదాడికి దిగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు సంచలనంగా మారినా టీడీపీ నాయకులు తేలు కుట్టిన దొంగల్లా నోరు మెదపకుండా ఇప్పుడు వాటితో తమకు సంబంధం లేదనటంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు వద్ద దీర్ఘకాలం పీఏగా పనిచేసిన శ్రీనివాస్, వారికి సంబంధించిన మూడు ఇన్‌ఫ్రా కంపెనీల్లో జరిపిన సోదాల్లో లెక్కలోకి రాని రూ.2,000 కోట్ల సొమ్మును కనుగొన్నట్లు ఐటీ శాఖ ప్రకటించాక శుక్రవారం కొందరు టీడీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి దాంతో తమకు సంబంధం లేదని బుకాయించడంతోపాటు ఆ కంపెనీలు వైఎస్సార్‌సీపీ కంపెనీలేనని ఎదురుదాడి మొదలుపెట్టారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన వెన్నంటే ఉండి ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దిన పీఏ శ్రీనివాస్, వైఎస్సార్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్, లోకేష్‌ సన్నిహితులైన కిలారు రాజేష్, నరేన్‌ చౌదరికి చెందిన కంపెనీల్లో సోదాలు జరిపి రూ.రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు కనుగొన్నట్లు ఐటీ శాఖ ప్రకటిస్తే అవి వైఎస్సార్‌సీపీ కంపెనీలని చెప్పడం, వాటితో తమకు సంబంధం లేదని బుకాయిస్తుండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటె దారుణమైన వక్రీకరణ, అడ్డగోలుతనం ఎక్కడా ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

తలో రకంగా మాట్లాడుతూ..
నిజంగా ఆ కంపెనీలు వైఎస్సార్‌సీపీకి చెందిన వారివైతే సోదాలు జరిగినప్పుడే ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్నలకు టీడీపీ నేతల వద్ద సమాధానం లేదు. చంద్రబాబు రాజకీయ జీవితంలో 10, 15 మంది పీఏలు పని చేశారని, వారితో తమకు ఏం సంబంధమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఎదురు ప్రశ్నించారు. పీఏ ఇంట్లో సోదాలు జరిగితే తమకు ముడిపెడతారా? అంటూ కొత్త భాష్యం చెప్పడం మధ్యాహ్నానికి మళ్లీ మాటమార్చి శ్రీనివాస్‌ ఇంట్లో జరిపిన సోదాల్లో ఏమీ దొరకలేదని, ఐటీ శాఖ ప్రెస్‌నోట్‌లో శ్రీనివాస్‌ ఈ లావాదేవీలు జరిపినట్లు పేర్కొనలేదని చెప్పారు. బొండా ఉమా లాంటి కొందరు నేతలు ఈ దాడుల్లో పెద్దఎత్తున డబ్బు దొరకలేదని, రాజకీయ వేధింపుల్లో భాగంగానే జరిగాయని ఆరోపణలు చేశారు. కొందరు టీడీపీ నాయకులు ఈ రెండు వేల కోట్లతో తమకు సంబంధం లేదని పేర్కొంటుండగా మరికొందరు అవన్నీ రాజకీయ వేధింపులని చెబుతూ వచ్చారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీ నాయకులు రకరకాలుగా స్పందించడాన్ని బట్టి వారిలో ఎంత గందరగోళం నెలకొందో బయటపడింది. వాస్తవాలను మరుగుపరిచేందుకు, తమ నేత నిప్పని చెప్పుకునేందుకు ఆరాటపడడమే తప్ప ఐటీ దాడులు జరిగింది తమ వారిపైనేనని, దీనిపై అడ్డగోలుగా మాట్లాడి తప్పించుకోవడం కుదరదనే స్పృహ టీడీపీ సీనియర్‌ నాయకుల్లోనూ లేకపోవడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

పరోక్షంగా ఒప్పుకున్న లోకేష్‌
ఐటీ దాడుల్లో బయటపడిన రూ.రెండు వేల కోట్ల అవినీతి వ్యవహారంపై టీడీపీ నేతల్లో ఎంత ఆందోళన ఉందో వారి మాటల ద్వారానే స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐటీ దాడుల్లో కొండను తవ్వి ఎలుకను పట్టారని అర్థం వచ్చేలా ట్వీట్‌ చేసిన చంద్రబాబు తనయుడు లోకేష్‌ అవి తమకు సంబంధించినవేనని ఒప్పుకున్నారు. బుకాయింపు, ఎదురుదాడి చేస్తూనే విషయాన్ని పక్కదారి పట్టించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గతంలో ఎప్పుడో పెట్టిన కేసులను ప్రస్తావిస్తూ ఎల్లో మీడియా ద్వారా హడావుడి చేస్తుండడం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement