నాయకుల వల్లే టీడీపీ ఓటమి

TDP defeat by the leaders - Sakshi

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా టీడీపీ కార్యకర్తల ఆగ్రహం

బాబు ఎదుట నాయకులను దూషించిన టీడీపీ క్యాడర్‌ 

ఈవీఎంల వల్లే ఓటమి చెందామని నాయకుల సమాధానం

ఓటమిపై సమీక్షించుకొని ముందుకెళ్దామన్న చంద్రబాబు

నగరంపాలెం (గుంటూరు)/ సాక్షి, అమరావతి: తెలుగుదేశం ఓటమికి కారణం ఆ పార్టీ నాయకులేనని ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అనంతరం ఎన్టీఆర్‌ జయంతి వేడుకల సందర్భంగా తొలిసారిగా మంగళవారం గుంటూరులోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన పలువురు కార్యకర్తలు ఓటమికి కారణం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులేనని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఈవీఎంలే మోసం చేశాయన్న నాయకులు  
అయితే సభలో మాట్లాడిన నాయకులు మాత్రం ఈవీఎంల వల్లే పార్టీ ఓడిపోయిందని ఆరోపించారు. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ టీడీపీ ఓటమి అసహజమైనదని, ఎన్నికల్లో ఏదో జరిగిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సాంకేతికంగా మరోసారి నష్టం జరగకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల సరళిలో మార్పు కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.  చంద్రబాబు మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలపై సమీక్షించుకొని ముందుకు సాగుదామని కార్యకర్తలకు సూచించారు. నూతన ప్రభుత్వం కొలువుదీరి ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కొంత అవకాశం ఇద్దామన్నారు. కాగా, గతంలో ఎన్నడూ టీడీపీ కార్యక్రమాల్లో కనిపించని భువనేశ్వరి ఈ సమావేశంలో పాల్గొని చివరివరకూ చంద్రబాబు పక్కనే కూర్చొని ఉండడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, నేతలు యనమల రామకృష్ణుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్, కాల్వ శ్రీనివాసరావు, నక్కా ఆనంద్‌బాబు, గల్లా అరుణకుమారి, యరపతినేని శ్రీనివాసరావు, దివ్యవాణి, సాదినేని యామిని తదితరులు పాల్గొన్నారు.

2024లో మంగళగిరి నుంచే పోటీ చేస్తా: లోకేష్‌ 
మంగళగిరి: ఓటమితో సంబంధం లేకుండా తెలుగుదేశంలో లోకేష్‌కి పార్టీ నాయకత్వాన్ని కట్టబెట్టేందుకు రంగం సిద్దమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరైన లోకేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు. 2024లో మంగళగిరి నుంచి పోటీ చేసి విజయం సాధిస్తానని, ఎమ్మెల్సీగా ఉండి మంగళగిరి నియోజకవర్గంలో అందరికీ అండగా ఉంటానని చెప్పారు.  

ప్రభుత్వం చెయ్యకపోతే పార్టీ చెయ్యాలి
ఎన్టీఆర్‌ జయంతినాడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ను అలంకరించకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వమే అలంకరణ ఏర్పాట్లు చేసిందని, ఈ ఏడాది కూడా చేస్తుందని ఆశించామని, దీనిపై తెలంగాణ టీడీపీ లేఖకూడా ఇచ్చిందని అన్నారు. దీనిపై చంద్రబాబు తెలంగాణ పార్టీ నేతలకు ఫోన్‌ చేసి ఇటువంటివి మళ్లీ పునరావృతం కారాదని సూచించారు. ప్రభుత్వానికి ముందుగా తెలియజేయాలని, వాళ్లు చేయకపోతే పార్టీ ద్వారా చేయాలని, లేదా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా శుభ్రం చేయాలని సూచించారు. ఇటువంటి విషయాల్లో ఎప్పుడూ సమాచార లోపం ఉండకూడదన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top