
సాక్షి, శ్రీకాకుళం : ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ నిర్ణయం చరిత్రాత్మకమని ఆ పార్టీ నేత తమ్మినేని సీతారాం అభివర్ణించారు. సోమవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్ష సభ్యుల పేర్లను, స్థానాలను అసెంబ్లీ ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. లేకపోతే కళంకిత స్పీకర్ గా కోడెల చరిత్రలో మిగిలిపోతారని తమ్మినేని తెలిపారు.
పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమన్న ఆయన, అలాంటివాళ్లు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటే ప్రజల తీర్పును అగౌరవపరిచినట్లేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న వారి తీరుకు నిరసనగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ నిర్ణయం తీసుకుందన్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించటం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఫిరాయింపులపై మీడియా ముందుకు చర్చకు రావాలని ఆయన సవాలవిసిరారు. 3 వేల కిలోమీటర్ల పాదయాత్రతో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రజా సంఘాలతో మొత్తం 185 సమర్వేశాలు నిర్వహిస్తామని.. రచ్చబండ, పల్లెనిద్ర ద్వారా ప్రతీ పౌరుడికి చేరువవుతామని తమ్మినేని ప్రకటించారు.