‘మజ్లీస్‌ భాషలానే.. కేసీఆర్‌ భాష ఉంది’

Sushma Swaraj Press Meet Over Telangana Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకునే బీజేపీ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తెలంగాణలో పర్యటిస్తున్న సుష్మా స‍్వరాజ్‌ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న మజ్లీస్‌.. నేడు టీఆర్‌ఎస్‌తో కలిసిందని విమర్శించారు. దేశ ప్రధానిపై కేసీఆర్‌ వాడే భాష ఎలాంటిందో ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు. మజ్లీస్‌ భాష ఎలా ఉందో కేసీఆర్‌ భాష అలానే ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ చెప్పినట్టు తెలంగాణ ఎక్కడ లండన్‌ అయిందో.. ప్రజలే సమాధానం చెప్పాలన్నారు.

ఇంకా సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. ‘ బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. కేవలం బీజేపీ మాత్రమే తెలంగాణకు ఎలాంటి షరతులు లేకుండా మద్దతు తెలిపింది. ఉద్యమం జరుగుతున్న సమయంలో అనేక మంది ఆహుతి అయ్యారు. తెలంగాణలో బలిదానాలు ఆపటానికి పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణ చూడటానికి బతకాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశాను. అమరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో నేడు వారి సంఖ్యను తక్కువ చేసి చూపడం బాధకరం. తెలంగాణ ఉద్యమంలో కేవలం కేసీఆర్‌ కుటుంబంలోని ఐదుగురు మాత్రమే పాల్గొన్నారా?. ఉద్యమం కోసం త్యాగాలు చేసిన వారికి ఏమి దక్కలేదు. యువతకు ఉద్యోగాలు రాలేదు. కేవలం కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయ’ని తెలిపారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top