టీడీపీ టచ్ అందరికీ ప్రమాదం: వైఎస్సార్‌ సీపీ ఎంపీలు

Sujana Chowdary is A agent of the Chandrababu, says YSR congress party - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి బురద జల్లడం మానుకోవాలని  అనంతపురం వైఎస్సార్‌ సీపీ ఎంపీ తలారి రంగయ్య హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుజనా చౌదరి మోసాలపై ఏడాది కిందట బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఎథిక్స్‌ కమిటీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సుజనా చరిత్ర బీజేపీ నేతలే బయటపెట్టారని, పార్టీ మారినా ఆయన టీడీపీకి మేలు చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఉలిక్కి పడటానికి మేము ఉడుత పిల్లలం కాదు...పులి పిల్లలం. సుజనా నీకు ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారు. వార్డు మెంబర్‌గా గెలవని నువ్వు..మాపై విమర్శలా?. బ్యాంకులకు కన్నాలు వేయడమే నీ పని’  అని ఎంపీ తలారి రంగయ్య ధ్వజమెత్తారు.

టీడీపీ టచ్ అందరికీ ప్రమాదం..
విరాళాలు ఇచ్చి  ఎంపీ పదవి కొనుకున్న సుజనా చౌదరికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లేదని ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. ‘బ్యాంకులు లూటీ చేసిన నీకు రాజ్యాంగంపై నమ్మకం ఉందా?. డొల్ల కంపెనీలు పెట్టి బ్యాంకుల డబ్బు తీసుకు వెళ్లిన దొంగ. పారదర్శకత, జవాబుదారితనం పాలన అందిస్తున్న నేత వైఎస్‌ జగన్‌. టీడీపీ భవిష్యత్‌ సర్వ నాశనం చేసినవారిలో సుజనా చౌదరి నెంబర్‌ వన్‌. 

సుజనా చౌదరి మేక్‌ ఇన్‌ ఇండియా కాదు...స్పాయిల్‌ ఆఫ్‌ ఇండియా. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చైర్మన్‌ పదవులు, రిజర్వేషన్‌లు ఇచ్చిన ఘటన సీఎం జగన్‌ది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేకపోవడంతో టీడీపీ నేతలు బీజేపీ పంచన చేరుతున్నారు. మరో  పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా జగన్‌ ఉంటారు. కలిసి కష్టాలు పంచుకున్నాం. ఆయనతో మేము ఉంటున్నాం. టీడీపీ టచ్‌ తగిలి కాంగ్రెస్‌ సర్వ నాశనం అయింది. తెలుగుదేశం పార్టీ టచ్‌ అందరికీ ప్రమాదమే’ అంటూ ఎంపీ విమర్శలు గుప్పించారు.

చదవండి: మేము తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ

సుజనా చంద్రబాబు ఏజెంట్‌...
ఎంపీ సుజనా చౌదరిని నమ్ముకుంటే కుక్కను పట్టుకుని గోదారి ఈదినట్లేనని ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. యూనివర్సిటీ భూములను అమ్మినట్లు నిరూపించకపోతే సుజనా పార్లమెంట్‌ వద్ద ముక్కు నేలకు రాయాలని సవాల్‌ విసిరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఇంగ్లీష్‌ విద్యను దూరం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, ఊరికే అభాండాలు వేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని ఎంపీ గోరంట్ల మాధవ్‌ హెచ‍్చరించారు. పార్టీ మారిన సుజనా చౌదరి ఇప్పటికీ చంద్రబాబు ఏజెంట్‌ అని అన్నారు.

టీడీపీ ఎందుకు మాట్లాడం లేదు..
కార్పొరేట్‌ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం ఉంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు మాట్లాడటం లేదని వైఎస్సార్‌ సీపీ ఎంపీ సత్యవతి సూటిగా ప్రశ్నించారు. ప్రజలంతా ఇంగ్లీష్‌ మీడియం కావాలని అంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇంగ్లీష్‌ మీడియం కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారని, అలా అని తెలుగు భాషను ప్రభుత్వం విస్మరించడం లేదన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడితే మూల్యం తప్పదని ఆమె అన్నారు. తెలుగు భాష గురించి మాట్లాడిన వాళ్లు ఎప్పుడైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారా అని, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలపై మాట్లాడే అర్హత సుజనా చౌదరికి లేదని అరకు ఎంపీ మాధవి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top