రేపు ‘వంచనపై గర్జన’

Strike under ysrcp in nellore - Sakshi

నెల్లూరులో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో దీక్షలు

వీఆర్‌ కళాశాల మైదానంలో ఏర్పాట్లు

హాజరుకానున్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు

నల్ల దుస్తులు ధరించి రావాలని పార్టీ సూచన

 ఏపీ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసన

సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోర వైఫల్యం, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూన్‌ 2వ తేదీన నెల్లూరులో ‘వంచనపై గర్జన’ దీక్ష నిర్వహించేందుకు వైఎస్సార్‌ సీపీ సిద్ధమైంది.

శనివారం నెల్లూరు వీఆర్‌ కళాశాల మైదానంలో జరిగే ‘వంచనపై గర్జన’ నిరాహార దీక్షకు పదవులకు రాజీనామాలు చేసిన ఐదుగురు వైఎస్సార్‌ సీపీ లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. దీక్షలో పాల్గొనేవారు తప్పనిసరిగా నల్ల దుస్తులు ధరించి రావాలని పార్టీ ఇప్పటికే అందరికీ సూచనలు జారీ చేసింది.

విశాఖ వేదికగా తొలి గర్జన
ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పార్టీ సీనియర్‌ నేతలతో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వంచిస్తున్న తీరుకు నిరసనగా ఏప్రిల్‌ 30వ తేదీన విశాఖపట్టణం వేదికగాతొలిసారి ‘వంచనపై గర్జన’ జరిగింది. నెల్లూరులో ఇప్పుడు రెండోసారి ఈ ఆందోళనను నిర్వహిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న వీఆర్‌ కళాశాల మైదానం వేదికగా వైఎస్సార్‌ సీపీ నేతలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టనున్నారు.

విభజన వల్ల రాష్ట్రం ఇప్పటికే అన్ని విధాలా అన్యాయమై పోయిన పరిస్థితుల్లో అనుభవజ్ఞుడినంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగి కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను సాధించడంలో ఘోరంగా విఫలమయ్యారనే అంశాన్ని గర్జన ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

విభజన చట్టంలోని హామీల సాధనను పట్టించుకోకుండా చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారనే అంశాన్ని ఎలుగెత్తి చాటేందుకు  వైఎస్సార్‌ సీపీ నేతలు సిద్ధమవుతున్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని వైఎస్సార్‌ సీపీ తొలి నుంచి చేస్తున్న ఆందోళనలు, ఉద్యమాలను అణగదొక్కేందుకు ప్రయత్నించిన చంద్రబాబు అవకాశవాద రాజకీయాలతో చివరికి మాట మార్చడం, హోదా కోసం పోరాడుతున్నట్లు ధర్మ పోరాట దీక్షలు చేయటంలో డొల్లతనాన్ని ఎండగట్టనున్నారు.

భారీగా తరలిరానున్న శ్రేణులు
అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు దాకా 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌ సీపీ నేతలు ‘వంచనపై గర్జన’ దీక్షకు తరలి రానున్నారు. విశాఖలో జరిగిన తొలి గర్జనకు ప్రజల్లో మంచి స్పందన లభించడం, పార్టీ శ్రేణులు ఉత్తేజం పొందడం లాంటి అంశాల నేపథ్యంలో నెల్లూరులో గర్జన కోసం పార్టీ నేతలు ద్విగుణీకృత ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గర్జనకు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం నెల్లూరు చేరుకుని వీఆర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాట్లను పరిశీలించారు. నెల్లూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సీనియర్‌ నేతలు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ముక్కాల ద్వారకానాథ్, పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులతో చర్చించారు.

పాలకుడికి దయా గుణం ఉండాలి: బొత్స
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనను బహిర్గతం చేసి ప్రత్యేక హోదా ఆకాంక్షను మరింత బలంగా వినిపించేందుకు నెల్లూరులో గర్జన దీక్ష నిర్వహిస్తున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు. అధికార పార్టీ నేతల స్వార్థం, అరాచకాలు, దోపిడీ విధానాలను గర్జన సభ ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు.

రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర లేదని, కరువుతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం సిగ్గుచేటని మండిపడ్డారు. పెట్రోలు ధరలు ఆకాశాన్ని తాకి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. గతంలో ధరలు పెరిగిన సమయంలో దివంగత వైఎస్సార్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 సబ్సిడీ ఇచ్చి ప్రజలపై ఆర్థికభారం లేకుండా చేశారని తెలిపారు. దయా గుణం కలిగిన పాలకులు ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు.

టీడీపీ మరో మోసం: సజ్జల
టీడీపీ, బీజేపీ నాలుగేళ్లపాటు మిత్రపక్షాలుగా కొనసాగి ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ మహానాడు సాక్షిగా ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీపైకి నెట్టి మరో మోసానికి తెర తీసిందన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ సీపీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు.

ఇప్పటికే వివిధ రూపాల్లో ధర్నాలు, దీక్షలు నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. అవిశ్వాసం పెట్టి వైఎస్సార్‌ సీపీ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి దీక్ష చేసినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top