ప్రత్యేక హోదాకు స్టాలిన్‌ మద్దతు

Stalin Supports to Special Status - Sakshi

సాక్షి, చెన్నై: ప్రత్యేక హోదాకు మద్దుతివ్వాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, ఇంటర్‌నేషనల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఫర్‌ ఏపీ స్పెషల్‌ స్టేటస్‌ కో ఆర్డినేటర్‌ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి సోమవారం డీఎంకే కార్యనిర్వాహాక అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌ను కలిశారు.

ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతుందని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. అభివృధ్దిలో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు చాలా వెనెకబడి ఉన్నాయని ఈ వివక్షకు వ్యకతిరేకంగా తాము చేస్తున్న పోరాటంలో  భాగస్వాములు కావాలని వారికి వినతిపత్రం అందజేశారు.

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి హోదా సాధించి తీరుతామని దానిలో భాగంగానే దక్షిణాదిలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు, సినీ ప్రముఖుల మద్దతు కోరుతున్నామని కేతిరెడ్డి తెలిపారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే దక్షిణాది రాష్ట్రాల్లో గోడవలు సృష్టిస్తుందని, ప్రత్యేకహోదా ఉద్యమం, కావేరి జలాల వివాదం, కేరళలో హత్యలు, కర్ణాటకలో మత సంఘర్షణలు దీనిలో భాగమేనని ఆరోపించారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో జాతీయ పార్టీల ప్రాతినిధ్యం చాలా తక్కువ కాబట్టే దక్షణాదిపై వివక్ష అని ఆరోపించారు. కాగా ప్రత్యేక హోదాకు స్టాలిన్‌ మద్ధతు తెలిపారని, త్వరలో విశాఖలో నిర్వహించనున్న 'సాగర తీరన హోదా ఉద్యమ కెరటం'  కార్యక్రమానికి స్టాలిన్‌ హాజరవుతారని తెలిపారు. ఏపీ  ప్రత్యేక హోదాకి మద్దతు కోరుతు ఇటీవల పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామిని కలిసి ఏఐసీసీ సమావేశంలో  తీర్మానం చేయమని కోరామని, తీర్మానం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి కేతిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top