కీలుబొమ్మలుగా గవర్నర్లు...

Stalin Condemns Karnataka Governor Decision on Govt Formation - Sakshi

కర్ణాటక పరిణామాలపై మండిపడ్డ స్టాలిన్‌

సాక్షి, చెన్నై : కర్ణాటక తాజా రాజకీయ పరిణామాలపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘గతంలో తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్లే, ఇప్పుడు ప్రధాని మోదీ కర్నాటకలోనూ రాజ్యాంగాన్ని ఆపహాస్యం చేశారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారారు. ఇది అందరికి తెలిసిందే. కానీ, ఇప్పుడు వాజుభాయ్‌ వాలా తీసుకున్న నిర్ణయాన్ని డీఎంకే తీవ్రంగా ఖండిస్తోంది.’ అని స్టాలిన్‌ అన్నారు. ఇక మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్‌ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించినట్లు స్టాలిన్‌ తెలిపారు.

అంతకు ముందు ఆయన తన ట్వీటర్‌లో ఆయన కర్ణాటక పరిణామాలపై వరుస ట్వీట్లు చేశారు. ‘కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వనించారు. ఏకపక్షంగా ఆయన తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యం పునాదులను నాశనం చేసేదిగా, ముఖ్యంగా బేరసారాలను ప్రొత్సహించేదిగా ఉంది. తమిళనాడులోనూ అవినీతి అన్నాడీఎంకేను కాపాడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి చేష్టలు రాజ్యాంగ విలువలకు ప్రమాదకారకంగా మారుతున్నాయి’ అని స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top