కాంగ్రెస్‌లో కొత్త కిరికిరి

Split wide open in Telangana Congress - Sakshi

ఎంపీ టికెట్లపై షురూ అయిన లొల్లి

సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేస్తానన్న అజహరుద్దీన్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో కొత్త కిరికిరి మొదలైంది! మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో రచ్చకు దారి తీశాయి. తాను ఈసారి సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉంటానని ఆయన బహిరంగంగా ప్రకటించడంతో ఇక్కడ్నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన అంజన్‌కుమార్‌ యాదవ్‌ భగ్గుమన్నారు. ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే ఆవేశంతో ఊగిపోయారు.

తనపై పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని, వీటిని కొంద రు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన నగర కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎంపీ అజహరుద్దీన్‌పై విరుచుకుపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, తాను సికింద్రాబాద్‌ నుంచే బరిలో ఉంటానని స్పష్టం చేశారు. అజహరుద్దీన్‌కు దమ్ముంటే హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయవచ్చని సవాల్‌ విసి రారు.

అంజన్‌కుమార్‌ మాట్లాడుతుండగానే మాజీ ఎంపీ వీహెచ్‌ సమావేశం నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. సికింద్రాబాద్‌ లోక్‌సభ విషయంలో జరుగుతున్న వివాదమే పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో నెలకొనడం గమనార్హం. ఒక్కో నియోజకవర్గం నుంచి నలుగురైదుగురు పోటీ పడుతుండటం చూస్తుంటే టికెట్ల సమయంలో తల నొప్పులు తప్పేలా లేవన్న చర్చ జరుగుతోంది. కొన్ని చోట్ల పార్టీ బరిలోకి దింపాలని భావిస్తున్న అభ్యర్థులు పోటీకి సుముఖంగా లేకపోవడం గమనార్హం.

టికెట్లు ఆశిస్తున్న వారి వివరాలివీ..
♦  మహబూబ్‌నగర్‌ పార్లమెంటు స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మళ్లీ పోటీ చేస్తారని అంటున్నారు. మాజీ మంత్రి డీకే అరుణ తన కుమా ర్తె శ్రుతిని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇక్కడ్నుంచి బీసీలకు సీటు ఇవ్వాల్సి వస్తే రాష్ట్ర ఓబీసీ సెల్‌ చైర్మన్‌ చిత్తరంజన్‌ దాస్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశముంది.
నాగర్‌కర్నూల్‌ నుంచి నంది ఎల్లయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వయసు, ఆరోగ్యం రీత్యా ఈసారి పోటీ చేయకుంటే మాజీ ఎంపీ మల్లు రవి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన గతంలో పోటీచేసిన జడ్చర్ల స్థానంలో జనరల్‌ అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలున్నాయి.
నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ నల్లగొండ పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తే తాను కాంగ్రెస్‌ నుంచి బరి లో ఉండి ఓడిస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈయనతో పాటు సీఎల్పీ నేత జానారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే జానా నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తారని అంటున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌ కూడా నల్లగొండ లోక్‌సభ సీటును ఆశిస్తున్నారు.
భువనగిరి పార్లమెంటు సీటు నుంచి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఆయ న సోదరుడు వెంకటరెడ్డి నల్లగొండ లోక్‌సభ నుంచి పోటీచేస్తే రాజగోపాల్‌ అసెంబ్లీ బరిలో ఉంటారు. అప్పుడు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలకు అవకాశం ఉంటుంది. దాసోజు శ్రవణ్‌ కూడా భువనగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
చేవెళ్ల పార్లమెంటు సీటు నుంచి గత ఎన్నికల్లో పటోళ్ల కార్తీక్‌రెడ్డి పోటీ చేశారు. ఆయన ఈసారి రాజేంద్రనగర్‌ అసెంబ్లీ స్థానం బరిలో నిలవాలనే ఆలోచనలో ఉన్నందున ఆయన తల్లి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల నుంచి పోటీకి దింపాలని హైకమాండ్‌ ఆలోచిస్తోంది. జెడ్పీ మాజీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కూడా ఈ సీటు ఆశిస్తున్నారు.
మల్కాజ్‌గిరి బరిలో రేణుకా చౌదరి ఉంటారనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన సర్వే సత్యనారాయణకు ఈసారి జనరల్‌ సీటు ఇవ్వకపోవచ్చని అంటున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దనరెడ్డి కూడా ఆసక్తి చూపుతున్నారు.  
♦  ఆదిలాబాద్‌ విషయానికి వస్తే ఆదివాసీలు, లంబాడీల మధ్య వివాదం నేపథ్యంలో గతంలో పోటీచేసిన నరేశ్‌జాదవ్‌కు టికెట్‌ ఇవ్వడంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఆదివాసీల ఉద్యమానికి నేతృత్వం వహిస్తోన్న సోయం బాపూరావు ఇక్కడ్నుంచి బరిలో ఉండే అవకాశాలున్నాయి.
♦  పెద్దపల్లి లోక్‌సభకు గతంలో పోటీచేసిన వివేక్‌ ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. ఇక్కడ్నుంచి ప్రస్తు తం తటస్థంగా ఉన్న మాజీ ఎంపీ సుగుణకుమారి పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్‌ లేదా ఉమ్మడి ప్రతిపక్షా ల అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్‌ను బరిలోకి దిం పాలనే ఆలోచన కూడా టీపీసీసీ పెద్దల్లో ఉంది. జెడ్పీ మాజీ చైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, స్థానిక నేతలు గజ్జెల కాంతం, గోమాస శ్రీనివాస్, గుమ్మడి కుమారస్వామిల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.
కరీంనగర్‌కు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్‌కు మధుయాష్కీగౌడ్‌ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి.
♦  వరంగల్‌ పార్లమెంటు స్థానం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన రాజయ్య మళ్లీ బరిలో ఉంటారనే చర్చ జరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా ఎస్సీ కోటాలో ఈ సీటును ఆశిస్తున్నారు. మాజీ మంత్రి విజయరామారావు పేరు కూడా వినిపిస్తోంది.
మహబూబాబాద్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ బరిలో ఉండే అవకాశాలున్నాయి. ఎల్‌హెచ్‌పీఎస్‌ నేత బెల్లయ్య నాయక్‌ కూడా పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు.
♦  జహీరాబాద్‌ లోక్‌సభ సీటుకు గతంలో పోటీచేసిన సురేశ్‌ షెట్కార్‌ ఈసారి పోటీకి ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ఇక్కడ ఇటీవలే పార్టీలో చేరిన మదన్‌మోహన్‌రావును బరిలో దింపే అవకాశాలున్నాయి.
మెదక్‌ నుంచి గతంలో పోటీ చేసిన శ్రవణ్‌రెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మావతి పేర్లు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్‌ లోక్‌సభ సీటుకు మాజీ క్రికెటర్‌ అజహరుద్దీనే సరైన అభ్యర్థి అని హైకమాండ్‌ భావిస్తోంది. ఆయన ఇక్కడి నుంచి పోటీచేసేందుకు ఇష్టపడకపోతే గతంలో అసదుద్దీన్‌పై పోటీచేసిన జాహెద్‌ అలీ ఖాన్‌కు మద్దతివ్వడం లేదంటే మరో మైనార్టీ అభ్యర్థి ని బరిలో నిలిపే అంశాలను టీపీసీసీ పరిశీలిస్తోంది.
n ఖమ్మం లోక్‌సభ విషయంలో ఇంకా స్పష్టత రా లేదు. సీపీఐతో పొత్తు కుదిరితే ఆ స్థానాన్ని వారికి వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ చేయాల్సి వస్తే రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి లేదా టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు (కాంగ్రెస్‌లోకి వస్తే)లో ఒకరు బరిలో ఉండొచ్చు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top