టీడీఎల్పీ భేటీకి.. ఆరుగురు ఎమ్మెల్సీలు డుమ్మా

Six MLCs not attended to TDLP Meeting - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆరుగురు ఎమ్మెల్సీలు షాకిచ్చారు. ఆదివారం నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి వారు గైర్హాజరయ్యారు. మండలి రద్దవుతుందనే ప్రచారం నేపథ్యంలో తీవ్ర ఆందోళనలో ఉన్న ఎమ్మెల్సీలను బుజ్జగించేందుకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీలంతా కచ్చితంగా సమావేశానికి రావాలని  చంద్రబాబే స్వయంగా పిలిచినా ఆరుగురు డుమ్మా కొట్టారు. గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్‌ రామకృష్ణ, శమంతకమణి కావాలనే సమావేశానికి దూరంగా ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. నలుగురు ఎమ్మెల్సీలు సమావేశానికి రాలేమని చంద్రబాబుకు సమాచారం ఇచ్చారని ముఖ్య నేతలు చెబుతున్నా.. అది వాస్తవం కాదని పార్టీలోని ఇతర నాయకులు పేర్కొంటున్నారు. సమావేశానికి హాజరైన పలువురు ఎమ్మెల్సీలపైనా పార్టీ ముఖ్యుల్లో అనుమానాలున్నాయి. 

బాబు, లోకేశ్‌ కారణంగా పదవులకే ఎసరు!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలు ఇప్పటికే టీడీపీని వీడారు. మరో ఎమ్మెల్సీ డొక్కా  ఏకంగా ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. తాజా పరిణామాలపై ఎమ్మెల్సీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తన రాజకీయం కోసం తమను బలిపెట్టాడని వాపోతున్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఆపలేమని తెలిసినా రాజకీయ ప్రయోజనం కోసం ప్రాకులాడి తమ పదవులు కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని లబోదిబోమంటున్నారు. మండలి చైర్మన్‌ను అనైతికంగా వాడుకుని ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత తీసుకొచ్చేలా చేశారని, చంద్రబాబు, లోకేష్‌ రాజకీయ అజెండా కారణంగా ఇప్పుడు మండలి రద్దయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. తమ రాజకీయ జీవితాలకు ముగింపు పడేలా వారిద్దరూ వ్యవహరించారని ఎమ్మెల్సీలు రగిలిపోతున్నారు.  

నేడు అసెంబ్లీకి గైర్హాజరవ్వాలని నిర్ణయం 
శాసన మండలిలో పరిణామాలపై సోమవారం అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. సమావేశానికి హాజరుకాకూడదని టీడీపీ నిర్ణయించింది. టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ సోమవారం నిర్వహించే అసెంబ్లీ అజెండా రాజ్యాంగ విరుద్ధమని, ఒక సభ గురించి మరో సభలో చర్చించడం పార్లమెంటరీ సాంప్రదాయాలకు వ్యతిరేకమన్నారు. మండలిని రద్దు చేస్తే తాను అధికారంలోకి వచ్చాక పునరుద్ధరిస్తానని భేటీలో ఎమ్మెల్సీలను సముదాయించారు. మండలి రద్దు వల్ల నష్టపోతే అన్ని రకాలుగా ఆదుకుంటానని, ఆర్థికంగా అండగా ఉంటానని హామీనిచ్చారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top