టీడీపీలో కొత్త కుంపటి.!

Shoba Swathi Rani Hopes Araku Parliament Ticket Vizianagaram - Sakshi

అరకు పార్లమెంట్‌పై శోభా స్వాతి రాణి ఆశలు

కుదరని పక్షంలో సాలూరు ఎమ్మెల్యే టిక్కెట్టుకు గురి

మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి  ఆమె భర్త మొగ్గు

గుమ్మడి సంధ్యారాణి,భంజదేవ్‌లకు తలనొప్పి

ఎస్‌కోటలో కోళ్ల లలిత కుమారికి అడ్డుపడనున్న హైమావతి!

సాక్షిప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీలో కాకలు తీరిన యోధులమని చెప్పుకునేవారు కూడా ఒక్కసారిగా తెరమరుగైపోతుంటారు. పార్టీలో నంబర్‌ టూ అనిపించుకుంటున్నారనే సరికి కనిపించకుండా పోతుంటారు. కొత్తవారు అనూహ్యంగా తెరపైకి వస్తుంటారు. సీనియర్లను దాటుకుని అవకాశాలను తన్నుకుపోతుంటారు. అలాంటి వారిలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ శోభాస్వాతిరాణి ఒకరు. చిన్న వయసులోనేపెద్ద పదవి చేపట్టి ఢిల్లీ స్థాయిలో కాన్ఫరెన్సుల్లో పాల్గొని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేశారు. ఇప్పుడవే మార్కులను చూసుకుని ఎంపీ టిక్కెట్టుపై కన్నేశారు. ఇప్పుడీ అంశం ఆ పార్టీ జిల్లా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇప్పటికే గ్రూపులుగా ఉన్న జిల్లా టీడీపీలో స్వాతిరాణి ప్రచార ఆర్భాటం కొత్త కుంపట్లు రాజేస్తోంది.

సిగపట్లు..
శోభా హైమావతి ఎస్‌కోట నుంచి టీడీపీ తరఫున గతంలో ఒకసారి గెలుపొందారు. తర్వాత టీడీపీ మహిళాధ్యక్షురాలుగా నియమితులయ్యారు. తాజాగా ఏపీఈపీడీసీఎల్‌ డైరెక్టర్‌గా నామినేటెడ్‌ పోస్టు దక్కించుకున్నారు. బీసీ కోటాలో ఎస్‌.కోట టిక్కెట్టు ఆశిస్తున్నారు. కోళ్ల లలిత కుమారి కూడా ఇదే టిక్కెట్టును నిలబెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హైమావతి అనుచరుల్లో కొందరిని తనవైపు తిప్పుకున్నారు. ఈ నేపథ్యంలో టిక్కెట్టు కోసం వీరిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే, కోళ్ల చేస్తున్న కొన్ని అవినీతి పనులను ప్రత్యర్ధి వర్గం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లింది. ఎలాగైనా ఆమెకు సీటు రాకుండా అడ్డుకోవాలని హైమావతి కుటుంబం గట్టిప్రయత్నం చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.

ఎంపీ లేదా ఎమ్మెల్యే..
తను అనుకున్నట్లు ఎంపీ టిక్కెట్టు రాకపోతే సాలూరు లేదా కురుపాం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని స్వాతిరాణి చక్రం తిప్పుతున్నారు. అంతేకాకుండా సాలూరు మున్సిపల్‌ చైర్మన్‌ పదవిపై ఆమె భర్త గణేష్‌ ఆశపడుతున్నట్టు  చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఒకే కుటుం బం నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ పదవులను ఆశిస్తున్నట్టవుతోంది. ఇది జరిగేపనేనా అంటే, ‘పనిచేస్తున్నాంగా ఎందుకు జరగదు’ అని ఆ కుటుంబ సభ్యుల నుంచి ఎదురు ప్రశ్న వస్తోంది. జిల్లాలోని సీనియర్లకు మాత్రం ఇది మింగుడు పడటం లేదు. ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని, వచ్చే ఎన్నికలపై భారీ ఆశలుపెట్టుకున్న తమని కాదని ఈ కుటుం బానికే అన్నీ ఇస్తామంటే చూస్తూ ఊరుకోమరనేది వారు చెబుతున్న మాట. మొత్తానికి విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు అంటూ గ్రూపులుగా ఉన్న జిల్లా టీడీపీలో ఇన్‌చార్జ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు తన గ్రూపును తయారు చేసుకోగా, కొత్తగా జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వాతిరాణి కుటుంబ గ్రూపు ఆమె భర్త గులిపిల్లి గణేష్‌ నేతృత్వంలో తెరపైకి వస్తోంది.   

వారసురాలొచ్చి...
డాక్టర్‌ చదివి వారసత్వంగా రాజకీయాల్లో అడుగుపెట్టిన హైమావతి కుమార్తె స్వాతిరాణి తొలిసారి వేపాడ మండల జెడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే ఎస్టీ కోటా లో జెడ్పీ చైర్‌పర్సన్‌ అయ్యారు. సీఎం తనయుడు, మంత్రి లోకేష్‌కు దగ్గరయ్యారు. ఆయన తన టీమ్‌లో ఆమె ఉండాలంటున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. స్వాతిరాణి మాత్రం ఎంపీ సీటు వచ్చేలా ఉందనే ఆశతో ఉన్నట్లు సమాచారం. ఆ ఆశతోనే అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజక వర్గాల్లో కార్యకలాపాలు ముమ్మరం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దానిలో భాగంగానే కొత్తమ్మతల్లి పండగకు అడిగినవీ, అడగనివీ చేస్తూ డబ్బులు వెదజల్లారనే చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే పట్టణ మంతా స్వాతిరాణి, ఆమె భర్త గణేష్‌ ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. సాలూరులో ఇప్పటికే భంజదేవ్‌ మూడు సార్లు ఎమ్మెల్యేగా చేయగా, గుమ్మడి సంధ్యారాని ఒకసారి టీడీపీ తరఫున, ఒకసారి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా పోటీచేసి ఓడిపోయినా తర్వాత ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యారు. ఇక్కడ వీరిద్దరూ ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top