
మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు.
ముంబై : ఎన్సీపీ చీలిక వర్గం తోడ్పాటుతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన క్రమంలో బీజేపీకి తగిన సంఖ్యాబలం లేదని, రాష్ట్రంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరుతుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. బీజేపీకి సహకరించిన పార్టీ నేత అజిత్ పవార్‌పై వేటును శరద్ పవార్ సమర్ధించుకున్నారు. ఇది ఏ ఒక్క వ్యక్తీ తీసుకున్న నిర్ణయం కాదని, ఇది పార్టీ నిర్ణయమని తేల్చి చెప్పారు.
ఎన్సీపీ వైఖరికి విరుద్ధంగా అజిత్ పవార్ వ్యవహరించారని మండిపడ్డారు. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, పార్టీ తరపున ఏ వ్యక్తీ నిర్ణయం తీసుకోలేరని శరద్ పవార్ స్పష్టం చేశారు. మరోవైపు తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు సమర్పించేందుకు ఎన్సీపీ, శివసేన నేతలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఇక సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు తొలి రోజు నేడు తమ కార్యాలయాలకు హాజరవనున్నారు.