
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించడంలో ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నానికి నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి చినరాజప్ప తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు పెద్ద సంఖ్యలో మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, యలమంచిలి రవి, నందిగం సురేష్ తదితరులు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను కలిశారు. సమగ్ర దర్యాప్తు జరిపి ఈ ఘటన వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించి అరెస్టు చేయాలని, జగన్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.