‘టీఆర్‌ఎస్‌ నుంచి ఎలాంటి హామీ రాలేదు’

Senior Leader Danam Nagender Resigns To Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్‌ నాయకులు దానం నాగేందర్‌ శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలకు పంపారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 30ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నా.. పార్టీ కోసం బాధ్యతగా పనిచేస్తూ వచ్చానని అన్నారు. అంతేకాక కాంగ్రెస్‌లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్‌లో ఏదైనా నా భూజాలపై వేసుకొని పనిచేశానని పేర్కొన్నారు. అంతేకాక కాంగ్రెస్‌ పార్టీలో చాలా పితలు ఉన్నాయన్నారు. బలహీన వర్గాల గురించి దివంగత నేత వైఎస్సార్‌  తర్వాత సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో నాకు తెలియకుండా సీట్లు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేసిన ఎదగకుండా వెనక్కి లాగుతున్నారని విమర్శించారు. ఒకే వర్గానికి చెందిన వారికి పార్టీలో ప్రధాన్యతా ఇస్తున్నారని దానం ఆసహనం  వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి తనకు ఎలాంటి హామీ రాలేదని దానం స్పష్టం చేశారు. అయినా టీఆర్‌ఎస్‌లో పని ఇస్తే చేస్తా.. లేకపోతే కార్యకర్తగా ఉంటానని దానం నాగేందర్‌ తెలిపారు. ‘అంజన్‌కుమార్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవని దానం స్ఫష్ట చేశారు. అతనికి పదవి ఇవ్వమని చెప్పిందే నేనే దానం తెలిపారు. నాకు కూడా కాంగ్రెస్‌లో పదవి ఫైనల్‌ అయింది.. పదవి వచ్చాక పోతే బాగోదని ఇప్పుడు కాంగ్రెస్‌ను నుంచి వెళ్లిపోతున్నానని దానం అన్నారు.

ఢిల్లీ చుట్టూ తిరిగే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కోరాం. హైకమాండ్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. తెలంగాణ జనాభాలో 51శాతం బీసీలు ఉన్నారు. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీలో గౌరవం లేకపోవడం, వారిని పక్కన పెట్టడం చాలా బాధ కలిగించింది. బస్సు యాత్రలో కూడా అతికష్టంగా బీసీ నుంచి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పార్టీ కో​సం సైనికుడిలా పనిచేస్తున్నాడు. కానీ, ఆయనను కూడా పీతల మాదిరిగా లాగుతున్నారు. సీనియర్‌ నాయకులు డీఎస్‌, కేకే దూరం కావడానికి గల కారణాలను రాహుల్‌ గాంధీకి వివరించాను. అంతేకాక టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని కొందరు నేతలు పనిచేయనీయడం లేదు. పొన్నాలకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు. పార్టీలో వీహెచ్‌ పరిస్థితి కక్కలేక.. మింగలేక ఉన్నట్టు ఉందని’ దానం పేర్కొన్నారు.

వైఎస్సార్‌ లాంటి నేత అవసరం..
కాంగ్రెస్‌ పార్టీకి దివంగత వైఎస్సార్‌ లాంటి నేత అవసరమని దానం నాగేందర్‌ అన్నారు. అంతేకాక వైఎస్సార్‌ లాంటి నేత ఇక దొరకరు అని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను దానం గుర్తు చేశారు. ఆ వర్గాలకు దివంగత నేత వైఎస్సార్‌ చేసినంత సేవ దేశంలో ఏ సీఎం చేయలేదని ఆయన పేర్కొన్నారు.

బుజ్జగించేందుకు ఉత్తమ్‌ ప్రయత్నాలు
దానం నాగేందర్‌ణు బుజ్జగించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రంగంలో దిగారు. దానంను కలిసేందుకు ఉత్తమ్‌ మీడియా సమావేశం జరిగే ప్రాంతానికి వెళ్ళారు. కానీ, అప్పటికే దానం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫోన్‌లో ట్రై చేసిన దానం అందుబాటులోకి రాలేదని సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top