‘సోదా’ డ్రామా రక్తికట్టించిన సీఎం రమేష్‌

Search At Mp House Nothing But A High Drama - Sakshi

హైదరాబాద్‌ : తప్పులు చేయడం..ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం అలవాటుగా మారిన టీడీపీ నేతల బరితెగింపు పరాకాష్టకు చేరింది. ఐటీ, ఈడీ దాడులపై గగ్గోలుపెడుతూ వ్యవస్థలను నీరుగారుస్తున్నారని మొసలి కన్నీరు కారుస్తున్న పచ్చతమ్ముళ్లు పోలింగ్‌కు ముందు హైడ్రామాలకు తెరలేపారు. టీడీపీ నేతల అరాచకాలపై దర్యాప్తు సంస్ధలు, అధికారులు స్పందిస్తే ప్రధాని మోదీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ల కుట్రగా రంకెలేస్తున్న తమ్ముళ్లు సరికొత్త కుట్రలతో చెలరేగుతున్నారు.

సీఎం చంద్రబాబు సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ నివాసం వేదికగా మరో నాటకాన్ని రక్తికట్టించారు. ఓ ఆంగ్ల దినపత్రిక రమేష్‌ ఇంట్లో సోదాల పేరిట జరిగిన తంతును బట్టబయలు చేసింది. శుక్రవారం ఉదయం సీఎం రమేష్‌ ఇంట ఇటీవల విడుదలైన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మూవీకి మించిన ఉత్కంఠ, దానికి అనుగుణంగా పచ్చ మీడియా హడావిడి అంతా పక్కా స్ర్కిప్ట్‌ ప్రకారం సాగింది.

చదవండి....(ఐటీ దాడులు.. హైడ్రామా.. సీఎం రమేశ్‌ దౌర్జన్యం!)

కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేష్‌ ఇంటిలో పోలీసులు తనిఖీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఎంపీ ఇంట్లోకి 40 మంది పోలీసులు ప్రవేశించి ఆయన బెడ్‌రూమ్‌లోనూ సోదాలు చేశారు. వారెంట్‌ లేకుండా నా ఇంటికి వచ్చి తనిఖీలు చేస్తారా అంటూ సీఎం రమేష్‌ ఖాకీలపై వీరంగం వేశారు. ఇదంతా మోదీ, జగన్‌, కేసీఆర్‌ల కుట్ర అంటూ సీఎం చంద్రబాబు నుంచి చోటా నేతల వరకూ హడావిడి చేశారు. అయితే సీఎం రమేష్‌ నివాసంలో సోదాలపై జిల్లా ఎస్పీ, డీఎస్పీలకే సమాచారం లేకపోవడం గమనార్హం.

రమేష్‌ డైరెక్షన్‌...రమణ యాక్షన్‌..
ఉన్నతాధికారుల సూచనలు లేకుండా పచ్చనేతలల ప్రోద్బలంతో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టిన ఎర్రగుంట్ల అర్బన్‌ ఇన్‌స్పెక్టర్‌ బీవీ రమణ ఈ వివాదానికి కేంద్రబిందువయ్యారు. కర్నూలు నుంచి కడపకు ఇటీవల బదిలీ అయిన రమణ ఎంపీ ఇంట్లో సోదాలు చేసిన 40 మంది పోలీసుల బృందానికి నేతృత్వం వహించారు. ఎంపీ, ఎంఎల్‌ఏ ఇంట్లో సోదాలు చేయాలంటే సంబంధిత డీఎస్పీ, ఎస్పీ, డీఐజీలకు సమాచారం అందించాల్సి ఉండగా, ఆయన ఇవేమీ ఖాతరు చేయకుండా ఎంపీ ఇంటి వద్ద ఉన్న సమయంలోనే సీనియర్‌ అధికారులకు సమాచారం ఇవ్వకుండా సోదాలకు వెళ్లడం వివాదాస్పదమైంది. సోదాలపై వారెంట్‌ గురించి ఎంపీ అడగ్గా తాము ఎన్నికల విధుల్లో ఉన్నామని అందులో భాగంగానే తనిఖీలు చేపట్టామని చెప్పడం గమనార్హం. పోలీసులు ఇలా సీఎం రమేష్‌ ఇంట్లోకి రాగానే ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఖాకీల వేధింపులు ఈసీ, ప్రధాని, జగన్‌ల కుట్రలో భాగమేనంటూ టీడీపీ నేతలంతా పాతపాట అందుకున్నారు. చం‍ద్రబాబు సహా పచ్చనేతలు, బాకా మీడియా దీనిపై ఊదరగొట్టింది.

చదవండి...(టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు)

సోదాల కుట్ర ఇందుకే..
రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌ ఇంట్లో సోదాల డ్రామాకు టీడీపీ వ్యూహాత్మకంగానే తెరలేపింది. కేంద్ర ప్రభుత్వం, ఈసీ, జగన్‌ లక్ష్యంగా పోలింగ్‌కు ముందు నిందలు మోపి ప్రజల్లో సానుభూతి రగిలించేందుకు ఈ ఎత్తుగడకు దిగారు. సోదా డ్రామకు పచ్చమీడియా ప్రచారం కలిసివస్తుందని పకడ్బందీగా తనిఖీల నాటకాన్ని రక్తికట్టించారు. మరోవైపు ఎన్నికల సమయంలో పాలక పార్టీ ఎంపీ విషయంలోనూ సోదాలకు తాము వెనుకాడమనే సంకేతాలను పంపడం ద్వారా పోలీసులకూ మంచిపేరు వచ్చేలా ఈ డ్రామాకు స్కెచ్‌ వేశారు. ఉన్నతాధికారుల సూచనలు లేకుండా, వారికి కనీస సమాచారం ఇవ్వకుండా ఇన్‌స్పెక్టర్‌ స్ధాయి అధికారి రాజ్యసభ ఎంపీ నివాసంలో తనిఖీలు ఎందుకు నిర్వహించారు, దీని వెనుక అతడిని ప్రేరేపించిన వారెవరనేది నిగ్గుతేల్చేందుకు విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top