శశి‘కల’కలం

Sasikala Released Date Viral in Social Media in Tamil nadu - Sakshi

ముందస్తు విడుదలపై ముమ్ముర ప్రచారం

వైరలైన ఆగస్టు 14 ముహూర్తం

కమలనాథుల ఎన్నికల వ్యూహమని గుసగుసలు

ఖండించిన బెంగళూరు జైలు అధికారులు

రాష్ట్ర రాజకీయ తెరపై శశికళ మరోసారి తళుక్కుమన్నారు. నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి కాకుండానే ఆగస్ట్‌ 14వ తేదీన ముందుగానే విడుదల కానున్నారని జోరుగాప్రచారం జరుగుతోంది.  

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో శశికళకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత జయలలితకు అన్నీతానై 32 ఏళ్లపాటు నీడలా వెంట నిలవడమే ఇందుకు కారణం. జయ తీసుకునే పార్టీ పరమైన అన్ని నిర్ణయాల వెనుక శశికళ ప్రమేయం ఉంటుందని ప్రతీతి. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయాల్లో తన అనుయాయులకు టిక్కెట్లు ఇప్పించుకోవడంతో ‘శశికళ వర్గం’ కూడా ఏర్పడింది. పైకి జయకు వీరవిధేయులుగా ఉంటూనే లోలోపల శశికళ బంటులుగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు ఎందరో ఉన్నారు. అందుకే జయ కన్నుమూయగానే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పోలోమంటూ శశికళకు పాదాక్రాంతమైనారు. అమ్మ తరువాత ఇక చిన్నమ్మే శరణ్యమని పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. గవర్నర్‌ను కలిసి ఇక సీఎం కావడమే తరువాయి అని అందరూ భావిస్తున్న తరుణంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో నాలుగేళ్ల శిక్ష, రూ.10 కోట్ల జరిమానాతో జైలు పాలుకావడం జరిగిపోయింది.

2017 టూ 2021  
ఆస్తుల కేసులో 2017 ఫిబ్రవరిలో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు జీవితం ప్రారంభించిన శశికళకు నాలుగేళ్ల శిక్షా కాలం 2021 ఫిబ్రవరితో ముగుస్తుంది. దాదాపుగా ప్రతి ఖైదీ తన శిక్షా కాలంలో అనేక వెసులుబాటులు  కలిగి ఉంటారు. విచారణ దశలో రిమాండ్‌ ఖైదీగా గడిపిన కాలం, సత్ఫ్రవర్తనతో శిక్షాకాలం నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ఆయా కేటగిరిలకు చెందిన ఖైదీలను ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రభుత్వాలు ముందుగా విడుదల చేస్తుంటాయి. శశికళ విషయానికి వస్తే రిమాండ్‌ ఖైదీగా జయలలితతోపాటు బెంగళూరు జైల్లో మూణ్ణాలుగు నెలలు గడిపి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ రిమాండ్‌ కాలాన్ని శశికళ విషయంలో పరిగణనలోకి తీసుకుంటే ముందుగా విడుదలయ్యే అవకాశం ఉంది. అది వీలుపడని పక్షంలో ఇక సత్ఫ్రవర్తన కింద పరిశీలించాల్సి ఉంటుంది. జైళ్ల శాఖ ఉన్నతాధికారుల ‘చేతి’చలువతో జైలు గోడల మధ్య లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారని, ఇష్టారాజ్యంగా ములాఖత్, జైలు నుంచి స్వేచ్ఛగా బయటకు వెళుతూ బెంగళూరు నగరంలో షాపింగ్‌ చేయడం వంటివి శశికళ సాగించారని బెంగళూరు అప్పట్లో జైళ్లశాఖ డీఐజీ రూప సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. శశికళ షాపింగ్‌కు వెళ్లివస్తున్న సీసీటీవీ పుటేజీలు సైతం బహుళ ప్రచారంలోకి వచ్చాయి. వీటిని గనుక ప్రభుత్వం సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుంటే సత్ఫ్రవర్తన కోటా కింద శశికళకు ముందస్తు విడుదల యోగం ఉండదు.(జైలులో చిన్నమ్మ జాగ్రత్తలు )

ఆగస్టు 14న విడుదలవుతున్నట్లుగా ప్రచారం  
సత్ఫ్రవర్తన కోటా కింద నాలుగేళ్ల జైలు శిక్ష ముగియకుండానే ఆగస్టు 14వ తేదీన శశికళ విడుదలవుతున్నట్లు ఒక సమాచారం వైరల్‌ అవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న శిక్షాఖైదీల్లో శశికళ కూడా ఉన్నారా అనే విషయం స్పష్టం చేయాలని కోరుతూ శశికళ కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నేత ఆశీర్వాదం ఆచారి.. సమాచార హక్కు చట్టం కింద బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు ఇటీవల దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా బదులురాలేదని సమాచారం. ఇదిలా ఉండగా, సత్ఫ్రవర్తన కోటా కింద ఆగస్టు 14వ తేదీన శశికళ విడుదల కానున్నారని ఆశీర్వాదం ఆచారి గురువారం ట్వీట్‌ చేసి కలకలాన్ని రేపారు. అంతేగాక రాజకీయవర్గాల్లో రసవత్తరమైన చర్చకు తెరలేపారు. వచ్చే ఏడాది (2021) ఏప్రిల్‌ లేదా మే మాసంలో తమిళనాడు అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అన్నాడీఎంకేలో కీలకపాత్ర పోషించిన శశికళ చలువవల్లే ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారు.

అదే తరుణంలో శశికళపై తిరుగుబాటు చేసిన ఓ పన్నీర్‌సెల్వం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. నటులు కమల్, రజనీకాంత్‌ రాజకీయ పార్టీలను పక్కనపెడితే అన్నాడీఎంకే, డీఎంకేలే ప్రధాన ప్రత్యర్థులుగా ఎన్నికల రణరంగంలో తలపడుతాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగానే శశికళ జైలు నుంచి విడుదలైతే అన్నాడీఎంకే రాజకీయాల్లో కుదుపుతప్పదు. ఈ పరిణామం అన్నాడీఎంకేకు అనుకూలమా ప్రతికూలమా అనేది అంచనాలకు అందని విధంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో డీఎంకే దూకుడుకు కళ్లెం వేసేందుకు అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కమలనాథులు వ్యూహం పన్నుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఎడపాడి ఎలాగూ విధేయుడు కాబట్టి శశికళ, టీటీవీ దినకరన్, పన్నీర్‌సెల్వంల మధ్య రాజీకి బీజేపీ ప్రయత్నాలు చేయవచ్చు. ఈ వ్యూహంపై రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా అన్నాడీఎంకేలో ప్రతిస్పందన ఎలాగుంటుందో తెలుసుకునేందుకే బీజేపీ అధిష్టానం ‘ట్రయల్‌ రన్‌’లా ఆశీర్వాదం ఆచారిచే ట్వీట్‌ చేయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కమలనాథులు ఆశించినట్లుగానే శశికళ ముందస్తు విడుదల రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. సత్ఫ్రవర్తన కింద శశికళ ముందుగా విడుదల కావాలంటే రూ.10 కోట్ల జరిమానా చెల్లింపుపై చిక్కు సమస్య ఉంది. ఆస్తుల కేసులో శశికళతోపాటూ జైలు శిక్ష అనుభవిస్తున్న ఇళవరసి, సుధాకరన్‌ కలిపి మొత్తం రూ.30 కోట్లు జరిమానా కట్టాలి. ఆ సొమ్ము కట్టిన పక్షంలో ఆదాయపు పన్నుశాఖ రంగప్రవేశం చేసి ఇంత సొమ్ము ఎక్కడిదని నిలదీస్తుంది. జరిమానా చెల్లించని పక్షంలో సత్ఫ్రవర్తన జాబితాలో చేరినా ముందస్తు విడుదలకు అవకాశం లేదు.

అబ్బే అదేం లేదు : బెంగళూరు జైళ్లశాఖ
ఆగస్టు 14వ తేదీన శశికళ విడుదలా, అబ్బే అదేం లేదని బెంగళూరు జైలు అధికారులు శుక్రవారం కొట్టివేశారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ‘సత్ఫ్రవర్తన కోటా కింద శిక్షా ఖైదీలను విడుదల చేయాలనే అంశంపై స్వాతంత్య్ర దినోత్సవానికి సుమారు పది రోజుల ముందు కర్ణాటక కేబినెట్‌ సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయాన్ని గవర్నర్‌కు ఆమోదానికి పంపుతుంది. ఆ తరువాతనే ఖైదీలను విడుదల చేస్తార’ని జైళ్లశాఖ అధికారి ఒకరు తెలిపారు. సత్ఫ్రవర్తన ఖైదీల విడుదలపై ప్రభుత్వం ఇంతవరకు సమావేశమే కాలేదని ఆయన స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top