ప్రభుత్వాన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నా: సజ్జల

Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Over Debt In His Regime - Sakshi

సాక్షి, విజయవాడ: ఇచ్చిన ప్రతీ హామిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రమక్రమంగా అమలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు మేలు చేకూరేలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతిపైసా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  అప్పులు, దారితెన్నూ లేని అధికార వ్యవస్థ సీఎం జగన్‌కు ఆహ్వానం పలికాయని అన్నారు. చంద్రబాబు  నాయుడు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టేశారని.. ఆయన హయాంలో గాడి తప్పిన పాలనను పట్టాలెక్కించిన సీఎం జగన్‌.. అనతికాలంలోనే పలు సంస్కరణలు చేపట్టారని పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. సలహాదారుగా ప్రభుత్వాన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నానని... సీఎం జగన్‌ పాలన పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలే అయ్యిందని.. ప్రజలతో పంచుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. (చదవండి: అవ్వాతాతల కంటికి వెలుగు)

రహస్యాలేమీ లేవు..
‘‘మేనిఫెస్టో.. ముఖ్యమంత్రి ఆలోచనలకు అద్దం పడుతోంది. సుదీర్ఘ పాదయాత్రలో కోట్లాదిమందితో మాట్లాడి.... వారి అభిప్రాయాలను ఆయన తెలుసుకున్నారు. వైఎస్సార్‌ సీపీ మేనిఫెస్టోలో రహస్యాలేమీ లేవు. అన్నీ ప్రజలకు తెలిసినవే. 2014లో రైతు రుణమాఫీ సాధ్యం కాదనుకున్నారు. అందుకే దాని జోలికి వెళ్లలేదు. అయితే రైతులకు సాంత్వన కలగాలనే ఉద్దేశంతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. కరువుతో కుంగిపోయిన రైతులను ఆదుకోవడానికి రైతు భరోసా ప్రవేశపెట్టారు. రైతులు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా సుదీర్ఘ ఆలోచన చేశారు. వైద్య ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు. అమ్మ ఒడి ద్వారా అర్హులైన ప్రతీ తల్లికి రూ. 15 వేలు ఇస్తున్నారు. నాడు- నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరిస్తున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని వారికి చేతినిండా పనిపెట్టారు. సీఎం జగన్‌.. ఒక నాయకుడిగా ఉండాలని అనుకోలేదు.. ఎల్లప్పుడూ ప్రజల మనిషిగా ఉండాలని కోరుకున్నారు. అందుకు అనుగుణంగా చేస్తున్న ప్రతి పని, ప్రవేశపెడుతున్న ప్రతీ సంక్షేమ పథకం.. అట్టడుగు వర్గాలవారికి చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఒక ఇంటి పెద్దగా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.

రాజకీయ నాయకుల జోక్యం తగ్గుతుంది..
చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి.. 2లక్షల 60 వేల కోట్ల అప్పుల భారం వేశారని సజ్జల దుయ్యబట్టారు. ‘‘60 వేల కోట్ల పెండింగ్ బిల్లులు చూపించారు. ఏ ఒక్క ఆదాయ వనరు కూడా సృష్టించలేదు
అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు. ప్రస్తుతం సీఎం జగన్‌ ఆ సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారుల్లో స్ఫూర్తిని తీసుకువచ్చేలా పనిచేస్తున్నారు. చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించారు. గ్రామ సచివాలయాలు వచ్చాక ప్రజలు నాయకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. పథకాలు ఏవైనా అక్కడే ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. దీనివల్ల రాజకీయ నాయకుల జోక్యం తగ్గుతుంది’’ అని తెలిపారు. వ్యక్తిగత ఖజానా నింపుకోవడం కోసం రాజధాని పేరిట చంద్రబాబు ఒక భ్రమ కల్పించారని సజ్జల విమర్శించారు. ‘‘ఇక్కడ రాజధాని కట్టాలని చంద్రబాబుకు ఏ కోశానా లేదు. బినామీల కోసం ఆయన ఇదంతా చేస్తున్నారని మాకెప్పుడో అర్థమయ్యింది. చంద్రబాబు ఆలోచన ప్రకారం లక్ష కోట్లు కావాలి. అయితే అంతమెత్తాన్ని ఒకే చోట ఎందుకు పెట్టాలని సీఎం జగన్‌ ఆలోచించారు. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top